ప్రీతి పవార్… కాలేయ సమస్య తర్వాత తిరిగి బరిలోకి దిగిన బాక్సింగ్ ఛాంపియన్. అనారోగ్యంతో తీవ్ర పోరాటం చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన బాక్సింగ్‌కు ఆమె కొంత కాలం దూరంగా ఉంది. ఇది ఆమెను మానసికంగా కొంత కుంగదీసినా తిరిగి కోలుకుంది. గత నెలలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్‌లో 54 కిలోల విభాగంలో స్వర్ణం సాధించింది. శారీరకంగా, మానసికంగా తనను తాను సిద్ధం చేసుకునేందుకు ఎంతో పోరాటం చేసిన ఆ యువ క్రీడాకారిణి పరిచయం నేటి మానవిలో…
నవంబర్ నెలలో ఢిల్లీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ సెమీఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన ఒలింపిక్ పతక విజేత, మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ హువాంగ్ హ్సియావో-వెన్‌ను ప్రీతి పవార్ ఓడించింది. దీంతో ఆమె తన అంతర్జాతీయ పునరాగమనాన్ని అద్భుతంగా ప్రారంభించింది. చాలా కాలం కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతూ అనారోగ్యంతో పోరాటం చేసింది ప్రీతి. కొంత కాలం విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగిని ఆమె ఫైనల్‌లో ఇటలీకి చెందిన సిరిన్ చర్రాబిని ఓడించి 54 కిలోల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది.
క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి
ప్రీతి 2003 అక్టోబర్ 23న హర్యానాలోని భివానీ ప్రాంతంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు మాజీ అథ్లెట్లు. వారి ప్రేరణతోనే ఈమె క్రీడా రంగంలోకి ప్రవేశించింది. ఆమెలోని క్రీడా సామర్థ్యాన్ని గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించి ఈ రంగంలో రాణించేందుకు సహాయసహకారాలు అందించారు. అవసరమైన శిక్షణ ఇప్పించారు. 2024 పారిస్‌కు ముందు జరిగిన ప్రీ-ఒలింపిక్స్ శిక్షణా శిబిరంలో 22 ఏండ్ల ఈ బాక్సర్ జర్మనీలో ఆసుపత్రి పాలైంది. అక్కడ ఆమెకు హెపటైటిస్ ఎ(కాలేయ సమస్య) ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈ స్వర్ణం ఎంతో ప్రత్యేకం
అనారోగ్యంతో పోరాడుతున్న ప్రీతి ఇప్పుడు ఒలింపిక్స్‌లో విజయం సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రజత పతక విజేత కొలంబియాకు చెందిన యెని అరియాస్‌తో జరిగిన 16వ రౌండ్ పోటీ తర్వాత మాత్రమే పక్కకు తప్పుకుంది. ‘ఈ స్వర్ణం నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే నేను చాలా కాలం తర్వాత తిరిగి బరిలోకి దిగి అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నాను. అయితే నేను చాలా ఒత్తిడికి గురయ్యాను నిజానికి కొంచెం భయపడ్డాను కూడా. కానీ నేను నా సొంత దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్నాను. అందరూ నన్ను ఎంతో ఉత్సాహపరిచారు. ఇదే నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటూ ఆమె ఓ వెబ్‌సైట్‌తో చెప్పింది.
ఆమె నిర్ణయాత్మక క్షణం
పోటీలో పాల్గొనే ముందు ప్రీతి చాలా భయపడింది. ‘ఆమె నాతో పోలిస్తే చాలా పొడవుగా ఉంది. ఈ విజయాన్ని నేను అందుకోగలనా అని నా మనసులో నేను ఎంతో మదనపడ్డాను’ అంటుంది ఆమె. అయితే తాను పొందిన శిక్షణ తనను మంచి స్థితిలో ఉంచుతుందని ఆమె నిరంతరం నమ్మింది. తన ప్రత్యర్థుల ఆటపై కూడా కోచ్‌లతో వివరణాత్మక విశ్లేషణలు చేసింది. ఇవన్నీ ఆమెను ఆమె సిద్ధం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాయి.
తిరిగి బలం పుంజుకొని
చాలా కాలం బాక్సింగ్‌కి దూరంగా ఉన్న ప్రీతి వాస్తవానికి చాలా కుంగిపోయింది. ‘నేను మళ్ళీ శిక్షణ ప్రారంభించినప్పుడు, శారీరకంగా ఎంత కఠినంగా ఉంటుందో నాకు అర్థమైంది. ఆనారోగ్యం నుండి కోలుకున్న తర్వాత సులభమైన కసరత్తులు కూడా నాకు చాలా కష్టంగా అనిపించాయి. దాంతో తిరిగి మొదటి నుండి శిక్షణ ప్రారంభించాల్సి వచ్చింది’ అని ఆమె వివరించింది. అయితే ప్రీతి కృషి, పట్టుదల ఫలించింది. ఆమె తన ఆట విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకుంది. ‘గతంలో నా ఆట ఎప్పుడూ దాడి చేయడానికి సిద్ధంగా ఉండేది. కానీ ఇప్పుడు నేను అన్ని సమయాలలో ముందుకు ఆడలేను. కనుక కౌంటర్-బాక్సింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించాను. ఉదాహరణకు నా ప్రత్యర్థి ‘దాడి చేసే’ బాక్సర్ అయితే, నేను కౌంటర్-బాక్సింగ్‌ను ప్రయత్నించాల్సి వచ్చింది’ అంటూ ఆమె తన ఆటలో తీసుకున్న మార్పుల గురించి వివరించింది. ముఖ్యంగా అనారోగ్యం నుండి కోలుకునే సమయంలో ప్రీతి తనను తాను మానసికంగా బలోపేతం చేసుకోవడం మొదలుపెట్టింది.
మానసిక ధైర్యంతో..
‘నాకు నేను ఎప్పుడూ ప్రోత్సహించుకుంటూ, ధైర్యం చెప్పుకుంటూ ఉంటాను. ‘నేను బాగానే ఉన్నాను, నాకు ఏమీ జరగలేదు. నేను అదే శక్తితో తిరిగి బరిలోకి దిగుతాను.’ అని మనసులో పదే పదే అనుకునేదాన్ని’ అని ఆమె చెబుతుంది. ఆమె తన మనసులోనే మొత్తం సెషన్‌లను నడిపేది. అంటే ట్రాక్ డ్రిల్స్, స్పారింగ్ రౌండ్లు.. ఇలా ప్రతి దీ. మూడు నిమిషాల పాటు ఆమె ప్రతి కదలికను తన కండ్ల ముందు ఊహించుకునేది. దాడి, రక్షణ కోసం ఎలా స్పందించాలో ముందే మానసిక రిహార్సల్ చేసుకోవడం వల్ల ఇది ఆమెకు ఎంతో సహయపడింది. ప్రతికూల ఆలోచనలు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసినపుడు ప్రీతి తనను తాను స్థిరపరచు కోవడానికి శ్వాస వ్యాయామాలు, జర్నలింగ్‌పై మొగ్గు చూపింది.
నాకు నమ్మకం ఉంది
‘దయచేసి బాక్సింగ్ వంటి పోరాట క్రీడలను ఎంచుకోండి. ఎందుకంటే అవి మన ఆత్మరక్షణకు కూడా ఎంతో ముఖ్యమైనవి. ఇవి మనల్ని స్వతంత్రంగా, బలంగా ఉండటానికి ప్రోత్సహి స్తాయి’ అని ఆమె అంటుంది. ఇటీవల కాలంలో అథ్లెట్లకు మద్దతు, మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, జెఎస్‌డబ్ల్యూ, ఇన్‌స్పైర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, స్పాన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నా యని ఆమె అంటుంది. ఈ కేంద్రాలలో ఇప్పటికే చాలా మంది యువతులు శిక్షణ పొందుతున్నారు. వీరిని చూసి భవిష్యత్తులో మరింత మంది అమ్మా యిలు బాక్సింగ్‌లోకి వస్తారని ఎంతో నమ్మకంగా చెబుతుంది. ఇప్పుడు ప్రీతి దృష్టి మొత్తం 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌పై ఉంది. అయితే దీనికంటే ముందు ఆమె వచ్చే ఏడాది ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనబోతోంది.
గాయాలకు భయపడొద్దు
అనారోగ్యం నుండి కోలుకునే సమయంలో ప్రీతికి కుటుంబం, స్నేహితుల మద్దతు పూర్తి స్థాయిలో లభించింది. ‘నా ఈ పునరాగమనంలో, ప్రతి అడుగులోనూ జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో కలిసి ఉన్నందుకే ఈ ఘనత సాధించాను’ అని ఆమె చెబుతోంది. ఇటీవలి కాలంలో బాక్సింగ్‌కు ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ భారతదేశంలోని యువతులు బాక్సింగ్ వంటి పోరాట క్రీడలకు దూరంగానే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ‘అమ్మాయిలు బాక్సింగ్ వంటి క్రీడలను ఎంచుకోవడం చాలా సంతోషం. కానీ వారిలో కొందరు గాయాలకు భయపడు తున్నారు. ఒక్కసారి గాయపడితే వారు తిరిగి రాలేకపోతున్నారు’ అని ప్రీతి అంటుంది. గాయాలు క్రీడలలో ఒక భాగమని, మానసికంగా దృఢంగా ఉండాలని ఆమె నొక్కి చెబుతుంది.
బాక్సింగ్ మనలో ధైర్యం పెంచుతుంది..
- Advertisement -
- Advertisement -



