నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులతో సతమతమవుతుంటాము. ఇక మహిళలైతే ఇటు ఇంటి పనులు.. అటు ఆఫీస్ బాధ్యతలతో అలుపు లేకుండా పనిచేస్తుంటారు. మరి.. ఎల్లకాలం ఇలా చేయడం వీలవుతుందా? కానే కాదు.. ఎందుకంటే నిరంతరాయంగా పని చేయడం వల్ల ఒకానొక దశలో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటారు. ‘ఇక నా వల్ల కాదు’ అన్న ఆలోచనలూ వస్తుంటాయి. అలాంటి సమయంలోనే విరామం అవసరం. ఎవరైనా సరే ఒంట్లో చురుకుదనం ఉంటేనే పనిపై ఏకాగ్రత పెట్టగలుగుతారు. అది లోపిస్తే మెదడు మొద్దుబారుతుంది. ఇలాంటి సమయంలో ఏ పని చేస్తున్నామో అర్థం కాదు. జ్ఞాపకశక్తీ తగ్గిపోతుంది. పనితీరు, ఉత్పాదకత దెబ్బతింటాయి. అందుకే ఏకాగ్రత లోపించినప్పుడు విరామం తీసుకోవడమే మంచి పరిష్కారం. అలాగే శరీరం, మనసు అలసిపోయాయనడానికి తొలి సంకేతం తలనొప్పి. అయితే కొంతమంది మాత్రలతో నొప్పి తగ్గించుకోవాలనుకుంటారు.
కానీ ఇది తాత్కాలికమే. టాబ్లెట్ ప్రభావం తగ్గాక మళ్లీ పరిస్థితి మొదటికొస్తుంది. ఇలా పదే పదే తలనొప్పి వేధిస్తున్నట్లయితే పని నుంచి విరామం తీసుకోవడం మంచిది. రోజంతా పని చేయడం వల్ల అలసట, నీరసం ఆవహిస్తాయి. అయితే రాత్రి పడుకున్నప్పుడు శరీరం, మనసు పునరుత్తేజితమై మరుసటి రోజుకు ఈ లక్షణాలు దూరమవుతాయి. కానీ కొంతమందిలో రాత్రంతా నిద్ర పోయినా మరునాడు రోజంతా అలసటగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు కొన్ని రోజులు ఆయా పనుల నుంచి విరామం తీసుకోవడం మంచిది. ఒక్కోసారి ఈరోజు కచ్చితంగా ఆఫీస్‌కి వెళ్లాలా? తప్పదా? రోజంతా ఎలా పని చేయాలి అనే అసహనం ఆవహిస్తుంది. నిజానికి మానసిక స్థితి ఇలా ఉన్నప్పుడు పని చేయడం చాలా కష్టం. అందుకే ఇలా అనిపించినప్పుడు బ్రేక్ తీసుకోవల్సిందే. అయితే మన జీర్ణ వ్యవస్థ కూడా మనం అలసిపోయామన్న సంకేతాన్ని ఇస్తుందంట. కనుక తరచూ బలబద్ధకం, విరేచనాలు, కడుపునొప్పి వంటి ఆనారోగ్యాల బారిన పడుతున్నట్లయితే విరామం తీసుకోండి. కొన్ని సార్లు మనకు నచ్చినా నచ్చకపోయినా కెరీర్‌ను కొనసాగించాల్సి రావచ్చు.
అలాగే వర్క్ లైఫ్ బ్యాలన్స్ చేసుకోలేక మరికొందరు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఒక రకమైన ఒత్తిడికి గురువుతుంటారు. దాంతో చిన్న చిన్న విషయాలకే బాధపడిపోతుంటారు. జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే ఈ పరిస్థితిని దూరం చేసుకోవాలంటే విరామం తప్పనిసరి. సాధారణంగా మనకు నచ్చిన పనులు చేసేటప్పుడు ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటే మాత్రం అన్నీ పక్కన పెట్టి బ్రేక్ తీసుకోవడమే మంచిది. లేదంటే మనం చేసే పనిని, ఉత్పాదకతను దెబ్బతీయడంతో పాటు అనుబంధాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలా విరామం తీసుకున్న సమయాన్ని మీకు నచ్చిన అభిరుచులపై దృష్టి పెట్టేందుకు ఉపయోగించుకోండి. అలాగే కెరీర్ బిజీలో పడి మీరు పక్కన పెట్టేసిన అంశాల గురించి ఆలోచించండి. గార్డెనింగ్, ఇష్టమైన సంగీతం వినడం, బుక్ రీడింగ్, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం, టూర్లకు వెళ్లడం ఇలా ఏదైనా మీ మనసుకు నచ్చింది చేసి రీఛార్జ్ అవ్వండి. అప్పుడే మళ్లీ కెరీర్‌లో కొత్త ఉత్సాహంతో దూసుకుపోవచ్చు.
విరామం
- Advertisement -
- Advertisement -



