Tuesday, July 8, 2025
E-PAPER
Homeఆటలుబ్రేకింగ్‌ బజ్‌బాల్‌

బ్రేకింగ్‌ బజ్‌బాల్‌

- Advertisement -

– కొత్త బంతితో కొట్టిన భారత్‌
– ఎడ్జ్‌బాస్టన్‌ విజయం ఫార్ములా ఇదే

టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీ. లీడ్స్‌లో నెగ్గాల్సిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి. ఒత్తిడితో బర్మింగ్‌హామ్‌కు చేరుకున్న టీమ్‌ ఇండియా ముందు ఎన్నో సవాళ్లు. వేగంగా దిద్దుకోవాల్సిన తప్పిదాలు ఎన్నో. 58 ఏండ్లుగా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌కు విజయం లేకపోవటంతో రెండో టెస్టులో గిల్‌సేనపై అంచనాలు లేవు!. అయినా, బర్మింగ్‌హామ్‌లో బజ్‌బాల్‌ను భారత్‌ దిమ్మతిరిగే దెబ్బకొట్టింది. శుభ్‌మన్‌ గిల్‌ రికార్డు సెంచరీలు, ఇతర బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన విజయంలో కీలక పాత్ర పోషించినా.. విజయానికి అసలు ఫార్ములా కొత్త బంతితో కోలుకోలేని దెబ్బతీయటమే.

నవతెలంగాణ క్రీడావిభాగం

భారత్‌, ఇంగ్లాండ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టు. టీమ్‌ ఇండియా తుది జట్టు జాబితా చూసి కెప్టెన్‌, కోచ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి, చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను బెంచ్‌కు పరిమితం చేయటం చర్చకు దారితీసింది. 20 వికెట్ల వేటలో బౌలింగ్‌ను బలోపేతం చేస్తారని అనుకుంటే.. లోతైన బ్యాటింగ్‌కు ఊతం అందించే లైనప్‌ను ఎంచుకోవటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కాంబినేషన్‌తో గిల్‌ ప్రణాళికలు ఏమిటనే విషయం అర్థం కావటానికి విమర్శకులకు ఎంతో సమయం పట్టలేదు. సీమ్‌, స్వింగ్‌, పేస్‌కు అనుకూలించే పిచ్‌పై కొత్త బంతితో 30 ఓవర్లలోనే మ్యాజిక్‌ చేయటం టీమ్‌ ఇండియా లక్ష్యం. ఆ విషయంలో టీమ్‌ ఇండియా వంద శాతం విజయవంతమైంది.


కొత్త బంతితో కొట్టారు
టెస్టు విజయాలు బౌలర్లు సాధిస్తారు. ఐదు రోజుల ఆటలో ఇది మౌళిక సూత్రం. కానీ, ప్రధాన బౌలింగ్‌ అస్త్రాలు లేకుండానే 20 వికెట్లు పడగొట్టే ప్రణాళిక గిల్‌ సిద్ధం చేశాడు. అందుకు కొత్త బంతిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్నారు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో భారత్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో తొలి కొత్త బంతితో (1-80 ఓవర్లు) 243 పరుగులకు 10 వికెట్లు పడగొట్టింది. రెండో కొత్త బంతితో (80 ఓవర్ల తర్వాత తీసుకోవచ్చు) 9.3 ఓవర్లలో 57 పరుగులకు 5 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కొత్త బంతితో 93 ఓవర్లలో 8 వికెట్లు మాత్రమే పడగొట్టారు. మ్యాచ్‌ గమనం ఇక్కడే మారింది. భారత బౌలర్లు కొత్త బంతితో 15 వికెట్లు పడగొట్టి 300 పరుగులే ఇచ్చారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు 8 వికెట్లకు ఏకంగా 399 పరుగులు సమర్పించారు. టెస్టు మ్యాచ్‌లో విజయం కోసం ఐదు రోజులు, 15 సెషన్ల పాటు కష్టపడాలి. కానీ ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ కొత్త బంతితో ఫలితాన్ని శాసించింది.


ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కొత్త బంతితో ఐదు వికెట్లు చేజార్చుకుంది. కానీ 33-80 ఓవర్ల మధ్య జెమీ స్మిత్‌, హ్యారీ బ్రూక్‌ అలవోకగా ఆడారు. ఆరో వికెట్‌కు 303 పరుగులు జోడించగా.. పాతక బంతిపై ఏకంగా 244 పరుగులు సాధించారు. ఈ సమయంలో ఈ జోడీ ఎటువంటి ఫాల్స్‌ షాట్‌ ఆడలేదు. కానీ 81వ ఓవర్‌లో కొత్త బంతి అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పారు భారత బౌలర్లు. కొత్త బంతితో భారత బౌలర్లు 20.87 శాతం ఫాల్స్‌ షాట్లను రాబట్టగా.. ఇంగ్లాండ్‌ బౌలర్లు 14.88 శాతం ఫాల్స్‌ షాట్లనే రాబట్టారు. నైపుణ్యం, సామర్థ్యం పరంగా ఇంగ్లాండ్‌, భారత్‌ బౌలింగ్‌ విభాగాలు సమవుజ్జీలు. కొత్త బంతిని సద్వినియోగం చేసుకోవటమే ఇరు జట్ల మధ్య వ్యత్యాసం.


సీమ్‌ వర్సెస్‌ స్వింగ్‌
బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌ పేసర్లు ఎక్కువగా సీమ్‌ను రాబట్టగా.. భారత పేసర్లు స్వింగ్‌ చేశారు. ఇంగ్లాండ్‌ వరుస ఇన్నింగ్స్‌ల్లో 23.6, 16 శాతం బంతులను 0.75 డిగ్రీలతో సీమ్‌ చేసింది. భారత్‌ 16, 21.3 శాతం బంతులనే 0.75 డిగ్రీలతో సీమ్‌ చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో తొలి కొత్త బంతితో ఇంగ్లాండ్‌ 38, 17.9 శాతం బంతులను సీమ్‌ చేయగా.. భారత్‌ 14.2, 22.8 శాతం బంతులను సీమ్‌ చేసింది. భారత్‌ రెండో కొత్త బంతితో మెరుగ్గా సీమ్‌ రాబట్టింది. నిలకడగా, తెలివిగా స్వింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టించి వికెట్ల వేటలో సఫలం అయ్యారు.


లెంగ్త్‌లో నిలకడ
రెండో టెస్టులో భారత బౌలర్లు ఎక్కువగా వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయలేదు. ఇంగ్లాండ్‌ పేసర్ల కంటే వేగంగానూ బంతులు వేయలేదు. కానీ, గుడ్‌ లెంగ్త్‌ బంతులను నిలకడగా సంధించారు. పిచ్‌పై 7-8 మీటర్ల లెంగ్త్‌ 15 శాతం బంతులను ఇంగ్లాండ్‌ సంధించగా.. భారత్‌ బౌలర్లు 30 శాతం బంతులను వేశారు. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ వ్యూహంలో గుడ్‌ లెంగ్త్‌ బంతులను షాట్లు ఆడింది. ఆకాశ్‌ దీప్‌, మహ్మద్‌ సిరాజ్‌ కట్టుదిట్టంగా అదే లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసేందుకు ఇది ఉపకరించింది. భారత బ్యాటర్లు గుడ్‌ లెంగ్త్‌ బంతులను గౌరవించగా.. ఇంగ్లాండ్‌ పేసర్లు ఫుల్‌, షార్ట్‌ బాల్స్‌కు వేసేందుకు మొగ్గుచూపారు.


అద్భుత వ్యూహం

ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌ జెమీ స్మిత్‌ ఎడ్జ్‌బాస్టన్‌లో గొప్పగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ సాధించిన స్మిత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. స్మిత్‌ దండయాత్ర చేస్తుండగా బంతి అందుకున్న ఆకాశ్‌ దీప్‌ అతడిని షార్ట్‌ బాల్స్‌లో ఉసిగొల్పాడు. వరుసగా రెండు షార్ట్‌ బాల్స్‌ను స్మిత్‌ సిక్సర్లుగా మలిచాడు. మూడో బంతిని సైతం షార్ట్‌ లెంగ్త్‌తో సంధించిన ఆకాశ్‌ దీప్‌ ఈసారి వేగాన్ని తగ్గించాడు. మళ్లీ సిక్సర్‌కు ప్రయత్నించిన స్మిత్‌ ఈసారి బౌండరీ లైన్‌ వద్ద దొరికిపోయాడు. ఈ వికెట్‌తో ఆకాశ్‌ దీప్‌ కెరీర్‌ తొలి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఐదో రోజు లంచ్‌ విరామానికి 192 సెకండ్ల సమయం ఉండగా.. 95 సెకండ్లలోనే జడేజా తన ఓవర్‌ పూర్తి చేశాడు. మరో 97 సెకండ్ల సమయం ఉండటంతో ఇంకో ఓవర్‌కు అవకాశం ఏర్పడింది. ఇది ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను పడగొట్టేందుకు భారత్‌ ఉపయోగించుకుంది. వాషింగ్టన్‌ సుందర్‌ ఆఫ్‌ స్పిన్‌ మాయజాలంతో స్టోక్స్‌ను బుట్టలో పడేశాడు. సుందర్‌ మాయకు ఎల్బీడబ్ల్యూగా నిష్క్రమించిన స్టోక్స్‌.. ఆతిథ్య జట్టు డ్రా ఆశలను ఆవిరి చేశాడు!. బ్యాటర్లను బోల్తా కొట్టించేందుకు ఏ అవకాశాన్ని సైతం భారత్‌ వదల్లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -