– 10మంది మృతి
– విచారణకు సీఎం ఆదేశం
దేశానికే గుజరాత్ మోడల్ అంటూ ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గురించి పదే పదే గొప్పలు చెబుతుంటారు. కానీ అక్కడి బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి నిదర్శనం అక్కడ వరుసగా కూలుతున్న వంతెనలేననీ చెప్పొచ్చు. ఇటీవల గుజరాత్‌లో ఐరన్ వంతెన కూలిపోయిన ఘటన మరచిపోకముందే. ..తాజాగా వదోదరాలో మరో వంతెన అమాంతం కూలిపోయింది. మరోఘటనలో వందమంది విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌కు గురయ్యారు. హాస్టల్లో నాసిరకమైన ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు పలుమార్లు ఆందోళనలు చేస్తున్నా..అక్కడి పాలకులు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు ప్రధాని మోడీ విదేశాలలో అత్యున్నత పురస్కారాలు అందుకుంటుంటే.. గుజరాత్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.
వదోదరా: గుజరాత్‌లోని వదోదరలో బుధవారం తెల్లవారుజామున వంతెన కూలిన ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో ఆరుగురిని కాపాడారు. ఈ విషయాన్ని గుజరాత్ హౌంమంత్రి సంఘ్వీ వెల్లడించారు. పద్రా వద్ద మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలటంతో నాలుగు వాహనాలు నదిలో పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహా వివిధ శాఖల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన మరికొందరి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వదోదర-ఆనంద్ పట్టణాలను కలిపే గంభీర వంతెన కూలటంతో ఆ రెండు పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గుజరాత్ నుంచి సౌరాష్ట్రకు వెళ్లే వాహనాలకు ఈ వంతెన ప్రధాన మార్గంగా ఉంది. సరైన మరమ్మతులు లేకపోవడం వల్లే వంతెన కూలినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
సహాయక చర్యలు
బుధవారం తెల్లవారుజామున వంతెన కూలిన సమాచారాన్ని స్థానికులు అగ్నిమాపక దళం, రెస్క్యూ బందానికి అందించారు. అగ్నిమాపక శాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముగ్గురిని నది నుంచి సజీవంగా బయటకు తీశారు. ఇప్పటి వరకు ఆరు మృత దేహాలను గుర్తించగా, మరికొందరు నదీ గర్భంలో చిక్కుకుపోయినట్టు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అనేక వాహనాలు వంతెన మీదుగా వెళుతున్నాయని స్థానికులు చెప్పారు. వదోదర, ఆనంద్ జిల్లాల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.