అర్జెంటీనాపై 4-2గోల్స్‌తో గెలుపు
ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్
చెన్నై: ఎఫ్‌ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో భారతజట్టు సంచలనం సృష్టించింది. అర్జెంటీనాతో బుధవారం జరిగిన కాంస్య పతక పోరులో తొలి మూడు క్వార్టర్‌లు ముగిసేసరికి 0-2గోల్స్‌తో వెనుకబడిన భారత్.. చివరి 12 నిమిషాల్లో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. చివరి క్వార్టర్‌వరకు హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ హాకీ యువ ఆటగాళ్లు 4-2గోల్స్ తేడాతో అర్జెంటీనాను ఓడించారు. మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో 3వ నిమిషంలోనే అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగేజ్ పెనాల్టీ స్టోక్‌ను గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యతలో నిలిపాడు. రెండో క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దీంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 0-1గోల్‌తో వెనుకబడింది. మూడో క్వార్టర్ చివరి నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు ఫెర్నాండెజ్ ఫీల్డ్ గోల్ చేయడంలో ఆ జట్టు 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. దీంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి అర్జెంటీనా 2-0గోల్స్‌తో ఆధిక్యతలో నిలిచింది.
చివరి క్వార్టర్‌లో భారత ఆటగాళ్లు చెలరేగి ఆడారు. 49, 52, 57, 58వ నిమిషాల్లో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టారు. దీంతో భారత్ సంచలన విజయం నమోదు చేసుకుంది. పాల్ అంకిత్, సింగ్ హన్మీత్ పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచారు. దీంతో భారత్ 2-2తో సమంగా నిలిచింది. 57వ నిమిషంలో తివారి శ్రద్ధానంద్ పెనాల్టీ స్టోక్‌ను గోల్‌గా మలిచి భారత్‌ను 3-2కు పెంచగా.. మరో నిమిషంలో ఎక్కా అన్మోల్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో భారతజట్టు 4-2గోల్స్ తేడాతో అర్జెంటీనాను చిత్తుచేసి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత రెండు సీజన్‌లలో భారత హాకీజట్టు నాల్గో స్థానానికే పరిమితం కాగా.. ఈసారి కాంస్య పతకంతో మెరిసింది. 5వ స్థానానికి జరిగే పోటీలో బెల్జియంజట్టు పెనాల్టీ షూటౌట్‌లో 4-3గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌ను, 7వ స్థానానికి జరిగిన పోటీలో ఫ్రాన్స్ జట్టు 4-1తో న్యూజిలాండ్‌ను ఓడించాయి.



