నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్‌లో నివాసం ఉంటున్న నరేంద్ర (32), చరణ్ (25) స్థానిక పాల వెంకటాపురం గ్రామ శివారులోని మామిడితోటలో ఉన్న నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు, మరికొందరు కూలీలతో కలిసి మామిడి చెట్లకు పురుగుమందు పిచికారీ చేసేందుకు వెళ్లారు.
వారంతా పనిలో ఉండగా.. అన్నదమ్ములిద్దరూ నీటి కుంట వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో తమ్ముడు చరణ్ కాలుజారి నీటిలో పడగా.. అతడిని కాపాడేందుకు వెళ్లిన అన్న కూడా మునిగిపోయాడు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో సమీపంలో గాలించగా.. నీటికుంటలో మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.



