Friday, December 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసు..నిందితుడి ఆత్మహత్య

బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసు..నిందితుడి ఆత్మహత్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అమెరికాను వణికించిన బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల కేసులో నిందితుడు మరణించాడు. ఆరు రోజులుగా సాగుతున్న భారీ గాలింపు చర్యలకు తెరదించుతూ, నిందితుడు స్వయంగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. న్యూ హ్యాంప్‌షైర్‌లోని సేలం ప్రాంతంలో ఉన్న ఒక స్టోరేజ్ యూనిట్ వద్ద నిందితుడిని గుర్తించిన పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

ఈ ఆపరేషన్ ముగిసిందని, ప్రజలకు ఇక ఎలాంటి ముప్పు లేదని మెథుయెన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. సాక్ష్యాల సేకరణ కోసం ఆ ప్రాంతంలో మరికొన్ని గంటల పాటు పోలీసుల బృందాలు తనిఖీలు కొనసాగిస్తాయని తెలిపింది. దీనిపై పూర్తి వివరాలను వెల్లడించేందుకు అధికారులు త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించనున్నారని ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది.

డిసెంబర్ 13న బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించడంతో పోలీసులు, ఎఫ్‌బీఐ సంయుక్తంగా నిందితుడి కోసం గాలింపు చేపట్టాయి. అయితే, ఎంఐటీ ప్రొఫెసర్ నునో లూరెరో హత్య కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. సీఎన్ఎన్ కథనం ప్రకారం ప్రొఫెసర్ హత్యకు ఉపయోగించిన వాహనం, బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నిందితుడు వాడిన వాహనం ఒకటేనని పోలీసులు గుర్తించారు.

రెండు వాహనాల లైసెన్స్ ప్లేట్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వాహనాన్ని ట్రాక్ చేశారు. లైసెన్స్ ప్లేట్ రీడర్ సహాయంతో కారు సేలంలో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి చేరుకున్నారు. నిఘా కెమెరాల కంట పడకుండా, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని తప్పించుకునేందుకు నిందితుడు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు అధికారులు తెలిపారు. తరచూ లైసెన్స్ ప్లేట్లు మార్చడం ద్వారా ఆరు రోజుల పాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -