Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ దొందూదొందే

బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ దొందూదొందే

- Advertisement -

వరంగల్‌కు ‘సామాజిక చైతన్య రథయాత్ర’
బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలి :ఆర్‌ఎల్డీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌
పాలన విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు దొందూ దొందే అని, బీసీ, ఎస్సీ, ఎస్టీలు అధికారం చేజిక్కించుకోవాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌ అన్నారు. ఆయన తలపెట్టిన ‘సామాజిక చైతన్య రథయాత్ర’ బుధవారం వరంగల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో బీసీల చైతన్యం పెల్లుబికి వచ్చిందని అగ్రవర్ణాల దోపిడీ పాలనను అంతం మొందించాలంటే ఈ వర్గాల ప్రజలు ఎస్సీ, ఎస్టీలతో జత కట్టి రాజ్యాధికారాన్ని సాధించాల్సిన అవసరం ఉందన్నారు. దొరల పాలన ఒకరిదైతే, దోపిడీ పాలన మరొకరిదని, ఇద్దరూ తెలంగాణను దోచుకుని తిన్న వాళ్లేనన్నారు.

హామీలను గుమ్మరించి అధికారాన్ని చేజికించుకున్న కాంగ్రెస్‌ చేసిందేంటో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. స్థానిక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ పట్ల సీఎం వ్యవహార శైలిని ఆమె కుమార్తె స్వయంగా ఎండగట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కమీషన్లకు కక్కుర్తి పడుతున్న వారున్నారని స్వయంగా మంత్రి కొండా సురేఖనే అన్నారని, వారిని క్యాబినేట్‌ నుంచి సీఎం తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే వారి బర్తరఫ్‌కు ఆర్‌ఎల్డీ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్న సీఎంకు అవినీతి మంత్రుల వివరాలు తెలియకుంటే ఆర్‌ఎల్డీ ఆ జాబితా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఆత్మ బలిదానాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణను ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజిక తెలంగాణగా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ వర్గాల వారికి ఇతర పార్టీల్లో టికెట్‌లు ఇవ్వకపోతే ఆర్‌ఎల్డీ 80 శాతం కేటాయించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సమర్థులైన యువత రాజకీయాల్లోకి రావాలిలని.. సామాజిక తెలంగాణను ఏలుకోవాలని అన్నారు. యువత సాధికారత కోసం నేషనల్‌ స్కిల్‌ మంత్రి, ఆర్‌ఎల్డీ పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్‌ సింగ్‌ అందిస్తున్న సహకారంతో వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, జిల్లాల్లో ప్రతీ మూడు నెలలకు ఒక సారి నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. టీఆర్‌ఎల్డీకి చెందిన లక్ష్యం యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌స్రైబ్‌ చేసుకుంటే ఇందుకు సంబంధించి వివరాలన్నీ తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో పాటు పార్టీ నాయకులు, బీరప్ప, మల్లేష్‌, రిషబ్‌ జైన్‌, నరసింహారావు, సుధాకర్‌ ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. బుల్లెట్‌ వెంకన్న ఆధ్వర్యంలో కళా బందం ప్రదర్శనలు నగర ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -