ఈనెల 14న కరీంనగర్‌లో సభ..
హాజరుకానున్న కేటీఆర్
బీసీలకు అవకాశాలిచ్చింది కేసీఆరే: గంగుల కమలాకర్
కాంగ్రెస్ బూటకపు హామీలు: తలసాని శ్రీనివాస్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఈనెల 14న కరీంనగర్‌లో ‘బీసీ కదన భేరి’ పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సభకు సంబంధించిన సన్నాహక సమావేశం సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు.బీసీలకు అవకాశాలిచ్చింది కేసీఆరే: గంగుల కమలాకర్‌మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసపూరిత నాటకాలు ఆడుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నించారా?అని ప్రశ్నించారు. వంద మంది ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ఈ అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ‘బీసీలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించింది, ఆర్‌టీసీ చైర్మన్‌గా, హైదరాబాద్ మేయర్‌గా బీసీలకే అవకాశం ఇచ్చింది కేసీఆర్’ అని గుర్తుచేశారు. మంత్రులుగా కూడా బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చింది గత ప్రభుత్వమే అని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని, లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ బూటకపు హామీలు: తలసాని శ్రీనివాస్‌మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని, ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు కేవలం ఓ తీర్మానం చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. కుల గణన, 42 శాతం రిజర్వేషన్ల అంశాలపై లోక్‌సభ ఎన్నికలకు ముందు హడావిడి చేసి ఇప్పుడు ఏమీ చేయడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి బీసీల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీలకు గురుకులాలు ఏర్పాటు చేసి, కులవత్తులకు వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించవద్దని డిమాండ్ చేశారు.
బీసీల గొంతు నొక్కే కుట్ర: మధుసూదనచారిశాసనమండలి పక్ష నేత మధుసూదనచారి మాట్లాడుతూ.. బీసీల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీలకు న్యాయం జరగాలంటే తమిళనాడు తరహాలో పోరాడాలని తాము కాంగ్రెస్‌కు సూచించినట్లు చెప్పారు. ఈ అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడమే ఏకైక మార్గమని చెప్పారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీల సంఖ్యను తక్కువగా చూపారని విమర్శించారు. కేంద్రానికి పంపిన ఆర్డినెన్స్ ముసాయిదాలో రాజకీయ రిజర్వేషన్ల అంశం మాత్రమే ఉందని, విద్య, వైద్యం వంటి ఇతర రంగాలను కావాలనే విస్మరించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో బీసీల రిజర్వేషన్లు పెంచితే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్న విషయం ప్రజలకు తెలుసని చెప్పారు.
సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనచారి, బండ ప్రకాష్, ఎల్.రమణ, మాజీ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కష్ణమోహన్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్లు తుల ఉమ, కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఒడితెల సతీష్‌బాబు, విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నాయకులు బండ శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, కరీంనగర్, సిరిసిల్ల బీఆర్‌ఎస్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.