– స్నేహితుల దాడితో తీవ్రగాయాలు
– పరిస్థితి విషమించి మృతి
– బర్త్‌డే వేడుకల్లో గొడవే కారణమని తండ్రి ఫిర్యాదు
– నిందితుల కోసం పోలీసుల గాలింపు
నవతెలంగాణ-వరంగల్
కూలి పనికి వెళ్లి తిరిగి వస్తున్న యువకున్ని దుండగులు దారికాచి అడ్డుకుని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వరంగల్ తూర్పు కోట ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగింది. నిందితులు పక్కా పథకం ప్రకారం దాడి చేసి తన కొడుకుని చంపేశారని మృతుడి తండ్రి మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాల ప్రకారం.. ఈ నెల 26న రాత్రి సుమారు 10 గంటల సమయంలో తూర్పు కోటకు చెందిన సంగరబోయిన సాయి(24) తన స్నేహితుని పుట్టినరోజు వేడుక కోసం ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లాడు. అక్కడ బోళ్ల మహేష్‌తో సాయికి గొడవ జరిగింది. ఈ విషయాన్ని మహేష్ తన అన్న బోళ్ల రాజేష్‌కి చెప్పాడు. సోమవారం సాయి వరంగల్‌కు కూలి పనికి వెళ్లి తిరిగి వస్తుండగా.. రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో కోమట్లబండ చిన్న హనుమాన్ దేవాలయం వద్ద బోళ్ల రాజేష్, బంగారి నవీన్, బంగారి రాజు, బంగారి వినీత్‌తోపాటు మరికొంత మంది అడ్డగించారు. సాయిపై దాడి చేసి పిడిగుద్దులు గుద్దారు. ఆ తరువాత రాజేష్ ఇనుప వస్తువుతో సాయి నుదుటిపై, చాతిపై, తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన జట్టబోయిన రమేష్, సాయి తండ్రి కుమారస్వామికి సమాచారం అందించాడు. కుటుంబీకులు వెంటనే అక్కడికి చేరుకునేసరికి నిందితులు పారిపోయారు. రక్తపు మడుగులో పడిపోయిన సాయిని తండ్రి కుమారస్వామి, జట్టబోయిన రమేష్, హరీష్ ఆటోలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయి రాత్రి 11 గంటల సమయంలో మృతిచెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
దీనిపై యువకుని తండ్రి సంగరబోయిన కుమారస్వామి మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై సీఐ రమేష్ స్పందిస్తూ.. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
యువకుడి దారుణ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



