-సిమెంట్ బస్తాల నిల్వగా మారిన ప్రభుత్వ భవనం
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం కొన్నాళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో అది క్రమంగా నిర్లక్ష్యానికి గురవుతోంది. రాత్రి వేళల్లో తాగుబోతులకు అడ్డాగా మారిన ఈ ప్రాంగణం ప్రస్తుతం మరింత దుర్వినియోగానికి గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల కొందరు వ్యక్తులు తమ ఇళ్ల నిర్మాణ పనుల కోసం సిమెంట్ బస్తాలను ఈ కార్యాలయం ఆవరణలో నిల్వ ఉంచుతున్నట్లు సమాచారం.ప్రభుత్వానికి చెందిన ఆస్తిని వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు కార్యాలయాన్ని పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయ భవనాన్ని రక్షించడమే కాకుండా,అక్రమ వినియోగాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.



