ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్)కు చెందిన ‘స్వదేశీ’ 4జీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఈ సేవలను ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన టెలికాం పరికరాలతో 4జీ సేవలను అందించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల నేపథ్యంలో మోడీ స్వదేశీ 4జీ సేవల్ని ప్రారంభించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లను ఆయన ప్రారంభించారు. దీంట్లో 92,600 4జీ టెక్నాలజీ సైట్లు ఉన్నాయి. దాదాపు రూ.37వేల కోట్లతో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టవర్లను నిర్మించారు. బీఎస్‌ఎన్‌ఎల్ స్వదేశీ 4జీతో .. స్వదేశీ స్ఫూర్తితో బలోపేతం అవుతుందని మోడీ అన్నారు. దేశీయ టెలికాం రంగంలో ఇది కీలకమైన మైలురాయి కానున్నది. ఒడిశాలోని జార్సుగూడలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ టవర్లను ఓపెన్ చేశారు. ఒడిశా, ఏపీ, యూపీ, మహారాష్ట్ర, రాజస్తాన్, అసోం, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు. ఒడిశాలో సుమారు రూ. 60 వేల కోట్లకు చెందిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.