Tuesday, July 1, 2025
E-PAPER
Homeజాతీయంబుల్డోజరు న్యాయమా !

బుల్డోజరు న్యాయమా !

- Advertisement -

కటక్‌ జిల్లాలోని పబ్లిక్‌ కమ్యూనిటీ సెంటర్‌ కూల్చివేతపై ఒరిస్సా హైకోర్టు ఆగ్రహం
ఆ తహసిల్దార్‌ జీతం నుంచి రెండు లక్షలు వసూలు చేయాలని ఆదేశాలు
10లక్షలు నష్టపరిహారం
భువనేశ్వర్‌ :
ఒడిశాలోని కటక్‌ జిల్లాలో బాలిపూర్‌లో దశాబ్దాల నాటి పబ్లిక్‌ కమ్యూనిటీ సెంటర్‌ను అక్రమంగా, అన్యాయంగా కూలగొట్టడాన్ని ఒరిస్సా హైకోర్టు తీవ్రంగా ఖండించింది. పైగా ఈ కేసులో జ్యుడీషియల్‌ కార్యకలాపాలు ఇంకా కొనసాగుతుండగానే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ ఇలా కూల్చివేయడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఇది బుల్డోజరు న్యాయానికి స్పష్టమైన ప్రతీకలా వుందని వ్యాఖ్యానించింది. ఈ తరహా కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోవడం పట్ల తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు జూన్‌ 20న ప్రభుత్వ తీరుపై ఒరిస్సా హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన ప్రక్రియను పక్కనబెడుతూ, జ్యుడీషియల్‌ అథారిటీకి విఘాతం కలిగిస్తూ, ఏకపక్షంగా ప్రభుత్వం తనకున్న అధికారాలతో ఇలా వ్యవహరించడాన్ని తప్పుబట్టింది.

దీనికి ప్రధానంగా తహసిల్దార్‌ను బాధ్యుడిగా పేర్కొంది. ఇలా అక్రమంగా కూల్చివేసిన ఈ ఘటనలో రూ.10లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అందులో రూ.2లక్షల మొత్తాన్ని సదరు తహసిల్దార్‌ వేతనం నుంచి వసూలు చేయాలని పేర్కొంది. అలాగే సదరు అధికారిపై శాఖాపరమైన విచారణలు కూడా చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇటువంటి కూల్చివేతల సమయంలో సుప్రీం కోర్టు జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. ఇటువంటి ప్రభుత్వ అత్యుత్సాహం వల్ల ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించింది.

పైగా చట్టబద్ధ పాలనకు కూడా విఘాతం కలుగుతుందని పేర్కొంది. ఆస్తి హక్కులనేవి రాజ్యాంగపరంగా రక్షణ కల్పించాల్సినవని, ప్రభుత్వ అధికారులు కూడా వాటిని గౌరవించాలని హైకోర్టు తన తీర్పులో ఉద్ఘాటించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ కమ్యూనిటీ హాల్‌ ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు బాగా ఉపయోగపడింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను అందచేసింది. 2024కి ముందు వరకు దీనిపై అధికారులు ఎలాంటి అభ్యంతరాలన వ్యక్తం చేయలేదు. కానీ గతేడాది జులైలో ఒక్కసారిగా ఓపీఎల్‌ఈ చట్టం కింద ఖాళీ చేయించే చర్యలు చేపట్టారు. దాంతో పిటిషనర్లు ఈ చర్యను సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్ళారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -