Saturday, March 7, 2026
E-PAPER
Homeజిల్లాలుభానుడి భగ భగ.!

భానుడి భగ భగ.!

- Advertisement -

మార్చిలోనే మండుతున్న ఎండలు
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. మార్చి ఆరంభంలోనే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్ మార్కు దాటాయి. ఉక్కపోత ప్రభావం మొదలైంది. మధ్యాహ్న వేళలో సూర్య ప్రభావానికి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలతో ప్రజలు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. ఫ్యాన్లకు విరామం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో మండలవ్యాప్తంగా ఒక్క సారిగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటుందో అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉపశమనానికి పాట్లు..
మార్చిలోనే సూర్యుడు సుర్రుమంటుండడంతో జనం విలవిల్లాడుతున్నారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానియాలను ఆశ్రయిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో బయటకు వచ్చేవారు తలకు రుమాళ్లు, టోపీలు ధరిస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లదనం కోసం ఇళ్లలో ఫ్రిజ్లు, కూలర్ల వాడకంతో పాటు మార్కెట్లో కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, దోసకాయలకు గిరాకీ పెరిగింది. ఐస్క్రీంల దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.దాహార్తి తీర్చుకునేందుకు జనం తాజా పండ్ల రసాల వైపు మొగ్గు చూపుతున్నారు..

గిర్రున తిరుగుతున్న మీటర్లు..
ఉష్ణోగ్రత తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలు నడుస్తుండడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోతుంది.దీంతో మీటర్లు గిర్రున తిరుగు తున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలవుతుండడంతో, నిర్దేశిత మార్కు దాటితే బిల్లు భారం తప్పదు. జనవరితో పోలిస్తే, ఫిబ్రవరిలో కరెంట్ వినియోగం పెరిగింది.తాజాగా భానుడి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుం డడంతో ఈనెలలో ఈ ప్రభావం మరింత ఎక్కువ గా ఉండనుంది.

పేదోడి ప్రిడ్జికి గిరాకీ..
సామాన్యుడి ప్రిడ్జిగా పేరుగాంచిన రంజన్ల కొనుగోలుపై జనం ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే మార్కెట్ లోకి వచ్చాయి. ఆరోగ్య హేతువు కావడంతోపాటు నల్లాలు ఉండడం, చల్లదనం సైతం ఎక్కువసేపు ఉండడంతో ప్రజలు కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -