Wednesday, December 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం'బైజూస్' రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో భారీ ఊరట

‘బైజూస్’ రవీంద్రన్‌కు అమెరికా కోర్టులో భారీ ఊరట

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ‘బైజూస్’ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు అమెరికాలోని డెలావేర్ కోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా గతంలో ఇచ్చిన బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 8,300 కోట్లు) తీర్పును కోర్టు బుధవారం నాడు రద్దు చేసింది. నవంబర్ 20న ఇచ్చిన ఈ తీర్పులో నష్టపరిహారాన్ని సరిగ్గా నిర్ధారించలేదని అంగీకరించిన కోర్టు, దీనిపై 2026 జనవరిలో కొత్తగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై రవీంద్రన్ న్యాయ సలహాదారు మైఖేల్ మెక్‌నట్ స్పందిస్తూ, ఇది చాలా కీలకమైన పరిణామమని అన్నారు. “ఈ దశలో బైజూ రవీంద్రన్ ఒక్క డాలర్ కూడా నష్టపరిహారంగా చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చెప్పింది” అని ఆయన తెలిపారు. త్వరలో జరిగే విచారణలో రుణదాతలకు ఎలాంటి నష్టం జరగలేదని నిరూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రుణదాతలైన జీఎల్ఏఎస్ ట్రస్ట్ (GLAS Trust), ఇతర సంస్థలు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులను, ప్రజలను తప్పుదారి పట్టించాయని రవీంద్రన్ న్యాయ బృందం తీవ్ర ఆరోపణలు చేసింది. వారి చర్యల వల్లే తమ ఎడ్‌టెక్ వ్యాపారం కుప్పకూలిందని, సుమారు 85,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని, 25 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడిందని వారు వాదించారు. అంతేకాకుండా, 533 మిలియన్ డాలర్ల ‘ఆల్ఫా ఫండ్స్’ను వ్యవస్థాపకులు వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని జీఎల్ఏఎస్ ట్రస్ట్ తప్పుడు ప్రచారం చేసిందని, దీనికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పిస్తామని రవీంద్రన్ బృందం తెలిపింది. ఈ ఏడాది చివరిలోగా జీఎల్ఏఎస్ ట్రస్ట్, ఇతర పార్టీలపై 2.5 బిలియన్ డాలర్ల దావా వేయాలని కూడా యోచిస్తున్నట్టు వారు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -