నవతెలంగాణ-హైదరాబాద్: కంబోడియా తమపై దాడులు చేస్తునే ఉందని థాయిలాండ్ పీఎం అనుతిన్ చరణ్‌విరాకుల్ అన్నారు. తమ సరిహద్దులతో పాటు సామాన్య జనాలపై కూడా దాడులు చేస్తోందని సోషల్ మీడియా ఫేస్ బుక్ వేదికగా మండిపడ్డారు. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సూచించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా కంబోడియా ఉల్లంఘించిందని తెలియజేశారు. తమ దేశ ఆర్మీ కూడా అందుకు దీటుగా స్పందిస్తోందని, కంబోడియా దాడులను తిప్పికొడుతున్నామని, ప్రత్యర్థులను నిలువరిస్తున్నామని ఆదేశ పీఎం పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఆరు రోజుల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రెండు దేశాల్లో 20 మందికి పైగా మరణించగా, దాదాపు 200 మంది గాయపడ్డారు. శతాబ్దాల నాటి దేవాలయాల వివాదాస్పద యాజమాన్యంపై రెండు దేశాల మధ్య ఘర్షణకు దారితీసింది. థాయిలాండ్-కంబోడియా సరిహద్దుకు 800 కి.మీ. పొడవైన (500-మైళ్ళు) ఇరువైపులా 600,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి.



