కుదరని ఏకగ్రీవాలు
చివరి నిమిషంలో క్యూలైన్లలోకి
అర్ధరాత్రి వరకు నామినేషన్లు
నేడు పత్రాల పరిశీలన..3 వరకు ఉపసంహరణ
11న పోలింగ్..అదేరోజు కౌంటింగ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు చివరిరోజు పోటెత్తారు. నామినేషన్ల దాఖలుకు శనివారం సాయంత్రం ఐదు గంటల వరకే తుది గడువు ఉంది. కానీ ఆ టైంకి భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో క్యూలైన్లలో ఉన్నారు. దీనితో వారందరికీ టోకెన్లు ఇచ్చి, అర్థరాత్రి వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తూనే ఉన్నారు. సహజంగా ఎన్నికల్లో పోలింగ్ టైంకు ఎంతమంది ఓటర్లు ఉంటే, అంతమందికి అవకాశం కల్పిస్తారు. దీనితో పోలింగ్ అర్థరాత్రుళ్లు వరకు కొనసాగుతుంది. కానీ ‘పంచాయతీ’ పోరులో నామినేషన్లు వేసేందుకే అభ్యర్థులు అర్థరాత్రిళ్ళ వరకు క్యూలైన్లలో వేచి ఉండటం గమనార్హం. తొలివిడత ‘పంచాయతీ’ 189 మండలాల్లో, 4,236 గ్రామాల్లో, సర్పంచ్ పదవుల కోసం శుక్రవారంనాటికి 8,198 మంది, 37,440 మంది వార్డు సభ్యుల ఎన్నిక కోసం కేవలం 11,502 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. పార్టీల మద్దతు ఎవరికి ఇస్తారో లెక్క తేలకపోవడంతో చివరి రోజైన శనివారం ఆశావహులు అందరూ నామినేషన్ల దాఖలుకు క్యూ కట్టారు. దీంతో అధికారులు ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
ఇక పార్టీల నేతలు చివరి నిముషంలో వార్డు సభ్యుల్నీ అలెర్ట్ చేశారు. దీనితో ముందస్తుగా అక్కడ కూడా ఆశావహు లంతా నామినేషన్లకు ‘క్యూ’ కట్టారు. వికారా బాద్ జిల్లా తాండూరు మండలంలో సర్పంచి, వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసే ప్రక్రియ రాత్రి 8 గంటల తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. జినుగుర్తి క్లస్టర్ కేంద్రంలో జినుగుర్తి, సంకిరెడ్డిపల్లి, ఉదండా పూర్, గుండ్లమడుగుతండా, మైసమ్మతండా అభ్యర్థులు, సిరిగిరిపేటలో అల్లాపూర్, సిరిగిరి పేట్, వీరారెడ్డిపల్లి, రాంపూర్, రాంపూర్ తండాకు చెందిన అభ్యర్థులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పిం చేందుకు ‘క్యూ’లో ఉన్నారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటంతో రాత్రి 9 తర్వాత కూడా ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ కొనసాగు తున్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండ లం సిద్ధాపూర్ కేంద్రంలో చీకటిపడిన తర్వాత కూడా ఓటర్ల తరహాలో అభ్యర్థులు క్యూలైన్లలో నిలుచుని ఉన్నారు. జినుగుర్తి క్లస్టర్ కేంద్రంలోనూ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మొత్తం నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయ్యేందుకు అర్థరాత్రి దాటుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు ఆదివారం తెల్లవారుజామునకు కానీ వెల్లడించలేమని తేల్చిచెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల అధికారులు ఆదివారం నామినేషన్ల పరిశీలన పూర్తిచేసి, అర్హులైన అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. డిసెంబర్ 1న అనర్హుల అప్పీళ్లకు అవకాశం ఇస్తారు. 2వ తేదీ అప్పీళ్లు పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. అది పూర్తయ్యాక, అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఆరు రోజులపాటు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 11న పోలింగ్, అదేరోజు మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, విజేతల ప్రకటన, ఆ వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక చకచకా జరుగుతాయి. ఏకగ్రీవాల కోసం అనేక గ్రామాల్లో చివరి వరకు నామినేషన్లు దాఖలు చేయలేదు. పలుచోట్ల ‘లెక్కలు’ తేలకపోవడంతో అభ్యర్థులు చివరి నిముషంలో నామినేషన్ల దాఖలుకు ‘క్యూ’ కట్టినట్టు సమాచారం. డిసెంబర్ 3న ఏ గ్రామంలో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారనే విషయంపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు అభ్యర్థుల దాగుడుమూతలు కొనసాగుతూనే ఉంటాయి!! .
నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ
రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌లో భాగంగా 193 మండలాల్లో 4,333 గ్రామపంచాయతీలు, 38,350 వార్డులకు ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. దీనికి తుది గడువు డిసెంబర్ 2 వరకు ఉంది.



