Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పథకాలు ఇయ్యలే.. పనులు చేయలే.!

పథకాలు ఇయ్యలే.. పనులు చేయలే.!

- Advertisement -

రావుల కల్పనను గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తది
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మల్హర్ రావు

అధికారంలోకి వస్తే అనేక పథకాలు ఇస్తమని హమీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లయినా పథకాలుఇయ్యలేదని, తట్టెడు మట్టిపోసే పనులు చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగంగా తాడిచర్లలో బీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి కల్పన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఓట్లకు వచ్చిన కాంగ్రెస్సోళ్లు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇంటింటికి కార్డులు ఇచ్చారని, కానీ 740రోజులైనా ఒక్క గ్యారెంటీని అమలు చేయలేదన్నారు. తాడిచర్ల నాగులమ్మగుడి వరకు రోడ్డు బాగు చేయలేదని, బ్రిడ్జి పనులు పూర్తి చేయలేదన్నారు.

ఏఎంఆర్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నోళ్లకు పైసలు ఇప్పిస్తామని ఆనాడు చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటి వరకు పైసలు ఇప్పించారా అని ప్రశ్నించారు. పథకాల పేరుతో మోసం చేస్తారని, ఓట్లు వస్తేనే పథకాలు గుర్తుకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీరలను ఓట్లు వస్తానయని ఇప్పుడు ఇస్తున్నారని, అవి కూడా గ్రూపులో ఉన్న మహిళలకేనని ఆయన వివరించారు. ప్రజల పక్షాన పోరాటం చేసి పథకాలను తీసుకురావాలంటే బీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థులను గెలిపించుకోవాలని, తాడిచర్లలో కల్పనను గెలిపించుకుంటే అభివృద్ది జరుగుతుందని, ప్రజల పక్షాన నిలబడిపోరాటం చేస్తుందన్నారు. గ్రామంలో గ్రామసభ జరిగితే ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్‌ కూడా అక్కడే కుర్చిలో కూర్చుంటరు…మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడుగుతాండ్లు ఎప్పుడు ఇస్తరని అడిగే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హమీలు ఇచ్చి మోసం చేశారని, మళ్లీ కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మితే మోసపోయి గోసపడక తప్పదన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తాడిచర్లను వెలుగులోకి తీసుకురావాలని పోరాటం చేశామని, తమ హాయాంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలని పదేపదే పోరాటం చేస్తే ఈనాడు కిషన్‌రావు పల్లి వద్ద పనులు మొదలుపెట్టిండ్లని అన్నారు. తాను అందుగులతండా వరకు రోడ్డు పనులు మొదలు పెట్టానని, దాన్ని పూర్తి చేయించాలంటే ఇక్కడ ప్రశ్నించి పోరాడే సత్తా ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృధ్ది చేశామని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వం మెడలు వంచేలా పనిచేస్తున్నామని అన్నారు.

తాను ప్రజల పక్షాన పోరాటం చేస్తే కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఊకదంపుడు కేసులకు భయపడేది లేదని, గెలిచినా ఓడినా ప్రజలకు అందుబాటులోఉంటూ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తాడిచర్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే, పథకాలు రావాలంటే ప్రశ్నించి పోరాడే కల్పనకు ఓటు వేసి బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -