నవతెలంగాణ-హైదరాబాద్: మరోసారి అవినీతి ఆరోపణలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్తాలోనిలిచింది.హెచ్‌సీఏ కమిటీ సభ్యులపై కేసు నమోదైంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హబీబ్ అహ్మద్, సందీప్ రాజన్, సందీప్ త్యాగిలు డబ్బులు డిమాండ్ చేశారని ఇద్దరు ప్లేయర్స్ తల్లిదండ్రులు ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అండర్ 19, అండర్ 23 లీగ్‌లలో ఆడించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వనందుకు మంచి ప్రదర్శన చేసినా తన కుమారుడిని ఆడనివ్వలేదని, సెలక్షన్ కమిటీపై చర్యలు తీసుకోవాలని ఓ ప్లేయర్ తండ్రి డాక్టర్ రామారావు కోరారు. మరో ప్లేయర్ తండ్రి కె.అనంతా రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు.
ఇటీవల హెచ్‌సీఏ ప్రకటించిన అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీకి ఆడే జట్టులో నిర్దిష్ట వయసు మించిన వారు, తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి హెచ్‌సీఏ లీగ్స్ ఆడుతున్నారని అనంతా రెడ్డి, రామారావు ఆరోపించారు. క్రికెటర్లు అడ్డదారిలో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతూ రాష్ట్ర జట్లలో స్థానం సంపాదిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 38 మంది క్రికెటర్లు తప్పుడు పత్రాలతో హెచ్‌సీఏ లీగ్‌ల్లో ఆడుతున్నారని.. సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇందుకు సహకరిస్తున్న హెచ్‌సీఏ పెద్దలపై కూడా కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో అనంతా రెడ్డి, రామారావు పేర్కొన్నారు.