– వివక్ష అంటూ ఆగ్రహం
నవతెలంగాణ – కాటారం
ఫిబ్రవరి 19న కాటారం మండలంలో మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా స్థానిక ప్రజలు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. దేశం కోసం, ధర్మం కోసం అనుక్షణం తపించిన మహాయోధుడు శివాజీ మహారాజ్ స్ఫూర్తితో హనుమాన్ దేవాలయం నుండి శోభాయాత్రగా ఊరేగింపు చేపట్టారు.
అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఖండించారు. ఒక వర్గానికే పరిమితంగా చర్యలు తీసుకోవడం వివక్షాత్మకంగా కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే ఫిబ్రవరి నెలలో ఒక రాజకీయ పార్టీ నాయకుడి పుట్టినరోజు సందర్భంగా జాతీయ రహదారిపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడిందని ఆయన గుర్తుచేశారు. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ, అప్పట్లో సుమోటో కేసు నమోదు కాలేదని పేర్కొన్నారు. అయితే శివాజీ మహారాజ్ జయంతి శోభాయాత్రపై మాత్రమే కేసులు నమోదు చేయడం అన్యాయంగా కనిపిస్తోందని తెలిపారు.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఒకే న్యాయం, ప్రతి మనిషికి ఒకే చట్టం వర్తించాలన్నారు. చట్టం అమలు విషయంలో ఎటువంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాలని పోలీస్ శాఖను రవి పటేల్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, సమాన న్యాయం జరగాలని డిమాండ్ చేస్తోంది.



