వృద్ధులకు కుటుంబం అండగా నిలవాలి
వనపర్తి డిఎస్పి వెంకటేశ్వర రావు
నవతెలంగాణ – వనపర్తి
వృద్ధులను వారి సంతానం పట్టించుకోకపోతే ఎవరైనా సంబంధీకులు కేసులు చేయొచ్చని వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వార్షికోత్సవాలలో భాగంగా అదనపు కలెక్టర్ యాదయ్య, డి.ఎస్.పి వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డి డబ్ల్యు ఓ సుధారాణి, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి మల్లికార్జున్, ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ఎడవల్లి వీరప్ప, ద్యారపోగు వెంకటేష్ వయోవృద్ధులు, విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి బాలుర పాఠశాల మైదానం వరకు వృద్ధులకు నడక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పి, అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ వయోవృద్ధులంటే చిన్న పిల్లలతో సమానమని, చిన్నపిల్లలను చూసుకునేటట్టు వారిని చూసుకోవాలన్నారు. వారిని కాపాడుకోవాలన్నారు. ఇప్పుడున్న బిజీ ప్రపంచంలో చాలామంది తమ కుటుంబంలోని పెద్ద వయసు వారిని చూసుకోవడం ఇబ్బందిగా మారుతుందన్నారు. ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఉన్నా, అది ప్రాక్టికల్ గా సాధ్యపడకపోవచ్చని చెప్పారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ వేరే ప్రాంతాలు దేశాల్లో ఉండేవారు ఇంట్లోనే ఉన్నా పొద్దస్తమానం పనులు ఒత్తిడితోనే సతమతం అయ్యేవారు పెద్దవారి ఆరోగ్యం ఆలనా పాలన చూసుకోవడానికి ఇబ్బందిగా మారిందన్నారు. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెద్ద వయసు వారిని చూసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. మన తల్లిదండ్రులను గౌరవించాలని, వయోవృద్ధుల పట్ల ప్రేమ ఆప్యాయత చూపాలని వారిని గౌరవించాలని వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్స్ ఎడవల్లి వీరప్ప ద్యారపోగు వెంకటేష్ అన్నారు.



