నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర బీజేపీ మనువాద విధానాలతో దేశంలో అట్టడుగు వర్గాలకు అన్యాయం జరుగుతుందని, కుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలలోని యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో దుర్మార్గమైన దాడులు దళితులు ఎదుర్కొంటున్నారని కుల దురహంకారులే భయపడే విధంగా అట్టడుగు వర్గాల్లో ప్రతిఘటన చైతన్యం పెరగాలని దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) జాతీయ కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్టార్ బాంకేట్ హాలులో మూడు రోజుల పాటు జరిగే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్రస్థాయి సామాజిక శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.ఈ తరగతుల ప్రారంభ సూచకంగా కెవిపిఎస్ జెండాను కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన ప్రారంభసభకు కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కోట గోపి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బీవీ రాఘవులు మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల కంటే రెట్టింపు స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాలలో దళితులపై దౌర్జన్యాలు పెట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగాన్ని అంగీకరించని మనువాద పాలకులు దేశాన్ని ఏలుతున్నారని చెప్పారు. అందుకు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మనువాద సమర్థకులందరూ కుల వ్యవస్థను దోపిడీని రక్షించే వాళ్లేనని చెప్పారు.
మనువాద ధర్మం సనాతన ధర్మం ఎడమ చేయి కుడి చేయి లాంటిదని అన్నారు. భూమి, రిజర్వేషన్లు, ప్రకృతి వనరులు అట్టడుగు వర్గాలకు దక్కకుండా కేవలం కుల సమస్య విడిగా పరిష్కారం కాదన్నారు. ఖాళీ కంచం ముందు పెట్టి తన్నుకు చావండి అన్నట్టు రిజర్వేషన్లు ఆ దుస్థితికి నెట్టబడ్డాయన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదన్నారు. అట్టడుగు వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు లేవని కేటాయించిన డబ్బులు ఖర్చు కావడం లేదన్నారు. సామాజిక వివక్ష ఆర్థిక వివక్షతోపాటు ప్రభుత్వ వివక్ష కూడా కొనసాగుతుందన్నారు.అన్ని రకాల వివక్షలను అంతమొందించడానికి సమాజంలో దోపిడిని ఎదిరించే శక్తులతో కలిసి సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేపట్టాలన్నారు. మహిళల పట్ల చిన్నచూపు సమాజా అభ్యున్నతికి ప్రమాదకరమన్నారు.
బీహార్ రాష్ట్రంలో మైనారిటీల ఓట్ల తొలగింపు పౌర ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుందన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా జరిగిన సార్వత్రిక సమ్మె కార్మిక ప్రజా ఐక్యతను చాటిందన్నారు. వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరించేవారు కుల వివక్షను సామాజిక అణిచివేతను ప్రశ్నించలేరని అన్నారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే రాజ్యాంగంలో సోషలిజం సెక్యులరిజం పదాలను తొలగించాలని వ్యాఖ్యానించడం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతంలో అంతర్భాగంగానే విమర్శించారు. ఆరెస్సెస్ సిద్ధాంతంలో రాజ్యాంగ విరుద్ధంశాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. సోషలిజం సెక్యులరిజం బూతు పదాలు కాదని అవి దేశ సమైక్యత సమగ్రతలకు సామాజిక న్యాయానికి సంపద పంపిణీకి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కెవిపిఎస్ నడిపిన సామాజిక ఉద్యమాల ఫలితంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పడిందన్నారు.
రాబోయే రోజులలో దళితులకు రాజ్యాంగబద్ధ హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం భూమి, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధన కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ఆయన కులం వర్గం అనే అంశంపై క్లాస్ బోధించారు.శిక్షణా తరగతులలో ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి అబ్బాస్ రాజకీయ అర్థశాస్త్రం అనే పాఠ్యాంశాన్ని బోధించారు.
ఈ తరగతులలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు ఏకలక్ష్మి ,సిఐటియు జిల్లా అధ్యక్షులు రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దండా వెంకటరెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, నందిపాటి మనోహర్ ,ఎం ప్రకాష్ కరత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మంద సంపత్, దుర్గం దినకర్, బోట్ల శేఖర్, కెవిపిఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి, వివిధ ప్రజా సంఘాల నాయకులు వేల్పుల వెంకన్న, జ్యోతి గోవింద్,నర్సింగరావు, వల్లపు దాస్ సాయికుమార్, జంపాల స్వరాజ్యం, శ్రీకాంత్,జహంగీర్,శంకర్ రెడ్డి,బుర్ర శ్రీనివాస్, చిన్నపంగు నరసయ్య, కృష్ణారెడ్డి,టేకుల సుధాకర్, దుర్గారావు,నందిగామ సైదులు, యాదగిరి, రమణ,అర్జున్, ఏసు, వెంకటేశ్వర్లు,మనోజ్, శ్రీకాంత్, ముత్యాలు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.