– హంతకులను కఠినంగా శిక్షించాలి : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎర్ర చంద్రశేఖర్ ప్రేమవివాహం చేసుకున్నాడన్న కారణంతో అతని సోదరుడు ఎర్ర రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారనీ, హత్యకు పాల్పడిన కుల దురహంకారులను కఠినంగా శిక్షించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఎ వెంకటేశ్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. హంతకులు పెట్రోల్ పోసి సజీవదహనం చేశారని తెలిపారు. నెలరోజుల క్రితం ఎర్ర చంద్రశేఖర్, కావలి భవాని ప్రేమ వివాహం చేసుకున్నారని పేర్కొన్నారు. వీరు చట్టబద్ధంగా మేజర్లని తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి కావలి వెంకటేష్ చంద్రశేఖర్ సోదరుడు రాజశేఖర్‌ను మాట్లాడుకుందాం అని పిలిచి నవాబుపేట ప్రాంతానికి తీసుకెళ్లి అమానుషంగా హత్యచేశారని తెలిపారు. ఇటీవలనే కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కోడలిని మామ హత్య చేశాడనీ, షాద్‌నగర్‌లో అన్నని హత్య చేశారని ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నా.. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం ధారుణమని విమర్శించారు. ఇటీవల కాలంలో కుల దూరహంకార హత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కులాంతర వివాహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తక్షణమే తీసుకురావాలని, మరో కుల దురహంకార హత్య జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దళిత యువకుడి కుల దురహంకార హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



