Monday, March 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాసంస్థల్లో కులవివక్ష దుర్మార్గం

విద్యాసంస్థల్లో కులవివక్ష దుర్మార్గం

- Advertisement -

యూనివర్సిటీల్లో యూజీసీ నిబంధనలు అమలు చేయాలి
అసెంబ్లీ సమావేశాల్లో రోహిత్‌ చట్టం తీసుకురావాలి : ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సదస్సు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌/
సిటీబ్యూరో/ఉస్మానియా యూనివర్సిటీ

ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో వేళ్లూనుకున్న కుల వివక్షను తక్షణమే తుదముట్టించాలనీ, విద్యార్థుల గౌరవం, భద్రతను కాపాడేందుకు ప్రత్యేకంగా ‘రోహిత్‌ చట్టం’ తీసుకురావాలని భారత విద్యార్ధి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర సదస్సు డిమాండ్‌ చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. రజనీకాంత్‌ అధ్యక్షత హైదరాబాద్‌లో నిర్వహిం చారు. సదస్సులో విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు టి.రమేష్‌ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో జ్ఞానం, విమర్శనాత్మక ఆలోచనలు , భావాజాల సంఘర్షణ కేంద్రాలుగా నిలవాల్సిన యూనివర్సిటీలు నేటికీ కుల వివక్షకు వేదికలుగా మారడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్ష కారణంగా రోహిత్‌ వేముల వంటి ప్రతిభావంతులైన విద్యార్థులను దేశం కోల్పోయిందని చెప్పారు. ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విద్యార్థులకు చట్టపరమైన రక్షణ కల్పించే రోహిత్‌ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకు రావాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర స్థాయిలో చట్టం చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం తన హామీని నిలుపు కోవాలని సూచించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌.రజనీకాంత్‌, టి.నాగరాజు మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులపై జరుగుతున్న వివక్ష, దాడులు, అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశ్వ విద్యాలయాల్లో యూజీసీ నిబంధనలను అమలు చేయాలనీ, ఈ నిబంధనలను కేంద్రం అమలు చేయకుండా న్యాయ సమస్యలు వచ్చేలా బీజేపీ అనుబంధ సంఘాలు చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. క్యాంపస్‌లలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని బలోపేతం చేసి, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభు త్వాలపై ఉందని తెలిపారు. సదస్సులో భాగంగా రోహిత్‌ చట్టం ఆవశ్యకతను వివరించే తీర్మానాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిక్‌ అహ్మద్‌ ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.కిరణ్‌ మాట్లాడుతూ కుల వివక్ష లేని విద్యార్థి సమాజాన్ని నిర్మించడమే ఎస్‌ఎఫ్‌ఐ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరిం చేందుకు అంతర్గత ఫిర్యాదు కమిటీలను బలో పేతం చేయాలని, వివక్షకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్‌, లావుడ్య రాజు, లెనిన్‌ గువేరా, అవినాష్‌, రాజేష్‌, అజరు, సతీష్‌, రాజు, నవ్య, శివాని, సుబ్బు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -