Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవామన్‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ ఎంట్రీ

వామన్‌రావు దంపతుల హత్య కేసులో సీబీఐ ఎంట్రీ

- Advertisement -

తెరపైకి కొత్త కోణాలు.. మంథనిలో వణుకు
– నియోజకవర్గంతో సంబంధమున్న కాళేశ్వరం కేసూ సీబీఐకి అప్పగింత


నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ చేపట్టింది. దాంతో ఈ కేసులో ప్రభావవంతంగా ఉన్న వారిలో అలజడి మొదలైంది. రాజకీయంగా శక్తివంతమైన మంథని నియోజకవర్గం మరో సారి వార్తల్లోకి ఎక్కింది. వామనరావు దంపతుల హత్య కేసులో కీలక పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంథని నేతలకు ప్రస్తుతం కంటి మీద కునుకు కరువైంది. ఈ కేసులో కీలక ఆధారాలు బయటకు వచ్చే అవకాశాలు న్నాయని, ఇప్పటి వరకు తెరవెనుక ఉన్న అసలు సూత్రధా రులు ఎవరో కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వామన్‌రావు హత్య కేసును సీబీఐ విచారణ చేపట్టింది. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచర్ల వద్ద నడి రోడ్డుపై న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులతోపాటు ఏడుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఈ కేసులో రాజకీయ ప్రభావం ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించింది. ఇన్‌స్పెక్టర్‌ విపిన్‌ గహలోత్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందం పాత నిందితులైన వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్‌, అక్కపాక కుమార్‌పై రీ రిజిస్టర్‌ చేసి విచారణ చేపట్టింది. అయితే, పాత నిందితులను మళ్లీ అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మంథనితో మరో కనెక్షన్‌
వామన్‌రావు హత్యకేసే కాకుండా మంథని నియోజక వర్గంతో సంబంధం ఉన్న మరో ప్రధాన కేసు కూడా సీబీఐ కి అప్పగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకు న్నది విథితమే. ఈ ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల, మేడి గడ్డ బ్యారేజీలు మంథని నియోజకవర్గంలోనే ఉన్నాయి.

సీబీఐ చొచ్చుకొస్తే..
గత ప్రభుత్వం సీబీఐ రాకుండా నిషేధం విధించగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిషేధ ఉత్తర్వులను ఉపసంహరిం చుకుంది. రెండు కీలక కేసులను సీబీఐ విచారణ చేపట్ట నున్నందున రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంథని నియోజకవర్గం నుంచి ఈ రెండు కేసులు సీబీఐ దర్యాప్తులో ఉండటంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారికి ఇప్పటి వరకు కొందరు ‘పెద్దల’ అండదండలున్నాయని ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఈ హత్యల వెనుక ఉన్న అసలు శక్తి ఎవరో తెలుస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు కేసుల ఫలితాలతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మంథని సహా పెద్దపల్లి జిల్లా రాజకీయ ముఖచిత్రం మారే అవకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad