న్యాయవాద దంపతుల హత్య కేసు విచారణ
నేరపూరిత కుట్ర కోణంలో ఎంక్వయిరీ
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి / ముత్తారం
పెద్దపల్లి జిల్లా మంథనిలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ప్రారంభించింది. స్థానిక పోలీసులు అందించిన వివరాలతోపాటు, కేసు పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు సీబీఐ బృందం స్వయంగా రంగంలోకి దిగింది. మంథని కోర్టుతోపాటు, హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది. సీబీఐ బృందం తొలిరోజు తమ దర్యాప్తును చాతి వ్యూహాత్మకంగా ప్రారంభించింది. ముందుగా సీబీఐ అధికారులు వామనరావు దంపతుల స్వగ్రామం గుంజపడుగులో కుటుంబ సభ్యులను కలిశారు. వామనరావు తండ్రి కిషన్‌రావు, సోదరుడు చంద్రశేఖర్‌తో మాట్లాడి, హత్యకు దారి తీసిన పరిస్థితులు, గతంలో జరిగిన సంఘటనలపై వివరాలు సేకరించారు. అనంతరం కిషన్‌రావుతో కలిసి నేరుగా మంథని కోర్టుకు వెళ్లారు. వామనరావు దంపతుల హత్య జరిగిన రోజు కోర్టులో వాదించిన కేసులు, వారి ప్రయాణ వివరాలపై ఆరా తీశారు. అనంతరం, కేసులో అత్యంత కీలకమైన రామగిరి మండలం సెంటనరీ కాలనీ సమీపంలో హత్య జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని, చుట్టుపక్కల వాతావరణాన్ని పరిశీలించారు. హత్య జరిగిన తీరును పునర్నిర్మించే (రీకన్‌స్ట్రక్షన్) దిశగా ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ మొత్తం ప్రక్రియలో గోదావరిఖని ఏసీపీ రమేశ్‌తోపాటు స్థానిక పోలీసులు సహకరించారు.
నేరపూరిత కుట్ర కోణంలో దర్యాప్తు
వామనరావు దంపతుల హత్య వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే స్థానిక పోలీసులు ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. సీబీఐ దర్యాప్తులో ఈ నిందితులతోపాటు, మరికొందరి పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ కేసు విచారణను సులభతరం చేసేందుకు రామగుండం కమిషనరేట్‌లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీబీఐ కోరినట్టు సమాచారం. వామనరావు తండ్రి కిషన్‌రావు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, సీబీఐకి అప్పగించింది.