నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు
పంటలకు మద్దతు ధర ప్రకటించాలి
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్
నవతెలంగాణ – బోనకల్
తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటలకు సమగ్ర మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం జిల్లా తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కమిటీ సమావేశం బోనకల్ మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో శుక్రవారం దివ్వెల వీరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఒక్కొక్క ఎకరానికి 10 నుంచి 14 క్వింటాల దిగుబడి వచ్చే పత్తి తుఫాను ప్రభావంతో వచ్చిన వర్షాల వలన రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల దగుబడి మాత్రమే వచ్చిందన్నారు.
ఇది కూడా చాలా భాగం తడిసిపోయిందన్నారు. సిసిఐ నిబంధనలను మార్చి రైతుల వద్ద ఉన్న పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన మధిర కేంద్రంలో రైతుల ప్రదర్శన ఉంటుందని ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా ఈనెల 26న ఖమ్మం జిల్లా కేంద్రంలో రైతుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. పంటలకు సమగ్ర మద్దతు ధర లేకపోవడం వలన రైతులు ప్రతి సంవత్సరం ఆర్థికంగా తీవ్రంగా నసపోతున్నారన్నారు. ఎరువులను రైతులకు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలన్నారు. పరిపాలన లోకి వచ్చిన ప్రతి పార్టీ తాము రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేస్తారని కానీ రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోరని విమర్శించారు. పంటలకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కల్పించాలని, నష్టపోయిన రైతులకు ఎంతో కొంత ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుందన్నారు. రైతులకు ఉపయోగపడే ఏ పథకాలను ప్రభుత్వాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఎన్నడు లేనివిధంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలయ్యారు అన్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు సర్వే చేసి నష్టపరిహారం చెల్లించవలసి ఉన్నప్పటికీ అటువంటి పని ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి అప్పులు పాలయ్యారన్నారు. అరకొర చేతికొచ్చిన పత్తిని గ్రామాలలో ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువకు కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల కూడా రైతులు ఆర్థికంగాn నష్టపోతున్నారన్నారు. కొంతమంది రైతులకు తీసిన పత్తికి కూలీలకు సరిపోతుందన్నారు. పాలకులు రైతులను మోసం చేస్తున్నాయని రైతులందరూ ఐక్యంగా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి వరప్రసాదరావు, నాయకులు తుళ్లూరు రమేష్, కొమ్మినేని నాగేశ్వరరావు, గుడ్డురి ఉమ, కందుల భాస్కరరావు, గొల్లపూడి కోటేశ్వరరావు, పులి యజ్ఞ నారాయణ, మందడపు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



