దరఖాస్తుల పరిశీలనలోనే వేటు వేయాలని నిర్ణయం
కాన్సులర్ అధికారులకు ట్రంప్ ప్రభుత్వం ఆదేశం
వాషింగ్టన్ : అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు, కార్మికుల హెచ్-1బీ వీసా దరఖాస్తులను మరింత వేగవంతంగా పరిశీలించాలని అమెరికా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిసింది. వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన ‘సెన్సార్‌షిప్’లో భాగస్వాములైన వారి దరఖాస్తులు తిరస్కరించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. అమెరికా విదేశాంగ శాఖ కేబుల్‌ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. భారత్, చైనా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున నియామకాలు జరుపుతున్న అమెరికాలోని టెక్ కంపెనీలకు హెచ్-1బీ వీసాలు అత్యంత కీలకమన్న విషయం తెలిసిందే. ఈ కంపెనీల యజమానులు, సీఈఓలు గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చి స్పాన్సర్ చేశారు. అమెరికా విదేశాంగ శాఖ కేబుల్ మంగళ వారం దేశంలోని అన్ని సంస్థలకూ ఆదేశాలు పంపింది.
హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు, వారితో ప్రయాణించే కుటుంబ సభ్యుల లింక్డిన్ ప్రొఫైల్స్‌ను లేదా రెజ్యూమ్‌లను సమీక్షించాలని అందులో కాన్సులర్ అధికారులను నిర్దేశించింది. తప్పుడు సమాచారం, దుష్ప్రచారం, కంటెంట్ నియంత్రణ, నిజ నిర్ధారణ, సమ్మతి, ఆన్‌లైన్ భద్రత వంటి పనులను ఎవరైనా చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ సమీక్ష నిర్వహించాలని సూచించింది. ‘దరఖాస్తుదారుడు అమెరికాలో సెన్సార్‌షిప్‌కు బాధ్యత వహించాడని లేదా అందులో భాగస్వామి అయ్యాడని తేలితే ఇమ్మిగ్రేషన్-జాతీయతా చట్టంలోని నిబంధనల ప్రకారం అనర్హుడిగా నిర్ధారించాలి’ అని స్పష్టం చేసింది. అలాంటి కార్యకలాపాలలో ఎవరూ పాలుపంచు కోకుండా చూసేందుకు వారి ఉద్యోగ చరిత్రలను కూలంకషంగా పరిశీలించాలని చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం తమ విదేశాంగ విధానంలో స్వేచ్ఛాయుత వాక్ స్వాతంత్య్రాన్ని కేంద్ర బిందువుగా చేసుకుంది. అమెరికన్ల ప్రసంగాలను సెన్సార్ చేసే వారి వీసాలను నిషేధిస్తామని విదేశాంగ మంత్రి మార్కో రుబియో మేలోనే హెచ్చరించారు.



