Wednesday, December 3, 2025
E-PAPER
Homeజాతీయంరెండు దశల్లో 'జన గణన'

రెండు దశల్లో ‘జన గణన’

- Advertisement -

డిజిటల్‌ విధానంలో నిర్వహణ
2026 ఏప్రిల్‌ నుంచి 2027 ఫిబ్రవరి వరకు : కేంద్రం


న్యూఢిల్లీ : దేశంలో జనగణన రెండు దశల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2026 ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జనగణన జరుగుతుందని మంగళవారం లోక్‌సభకు తెలిపింది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ వేసిన ప్రశ్నకు, హౌం వ్యవహారాల సహాయమంత్రి నిత్యానంద్‌ రాయ్ సమాధానమిస్తూ జనగణన గురించి తెలిపారు. జనగణన మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌, సెన్సెస్‌, రెండో దశలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ‘మొదటి దశ జన గణన 2026 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జరుగుతుంది. అయితే ఆయా రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యానికి అనుగుణంగా 30 రోజుల వ్యవధిలోనే సెన్సెస్‌ నిర్వహణ ఉంటుందని’ నిత్యానంద్‌ రాయ్ పేర్కొన్నారు.

”2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 మధ్యలో రెండో దశ జనగణన జరుగుతుంది. అయితే లద్ధాక్‌, జమ్మూ కాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లోని మంచుతో కప్పబడే నాన్‌-సింక్రోనస్‌ ప్రాంతాల్లో జనగణన 2026 సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ 1 మధ్య జరుగుతుంది” అని నిత్యానంద్‌ రాయ్ లోక్‌సభకు తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు ముందు వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలు, సంస్థలు, సెన్సెస్‌ డేటా యూజర్ల నుంచి వచ్చిన సలహాలు, సూచనలు ఆధారంగా జన గణన ప్రశ్నాపత్రాన్ని రూపొందించినట్టు మంత్రి చెప్పారు. మన దేశంలో జనగణనకు 150 ఏండ్లకు పైగా చరిత్ర ఉందని, ఇంతకు ముందు నిర్వహించిన జనాభా లెక్కల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా తదుపరి జన గణనకు పరిగణనలోకి తీసుకుంటామని ఆయన అన్నారు.

డిజిటల్‌ విధానంలో…
2027 జనాభా లెక్కింపు డిజిటల్‌ వేలో నిర్వహించనున్నట్లు మంత్రి నిత్యానంద్‌ రాయ్ పేర్కొన్నారు. మొబైల్‌ యాప్‌ల ద్వారా డేటాను సేకరిస్తామని, స్వీయ గణనకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కులగణన కూడా
మరో ప్రశ్నకు నిత్యానంద్‌ రాయ్ సమాధానం ఇస్తూ, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ నిర్ణయించిన విధంగా కులగణనను కూడా ఈ జనాభా గణనలోనే జరుగుతుందని ఆయన లోక్‌సభకు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -