Friday, December 5, 2025
E-PAPER
Homeజాతీయంకేరళపై కేంద్రం కుట్ర

కేరళపై కేంద్రం కుట్ర

- Advertisement -

మూడేండ్లుగా రూ.1160 కోట్లు పెండింగ్‌
సమగ్ర శిక్ష నిధులు నిలిపివేత
మోడీ సర్కారు తీరు అన్యాయం : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమగ్ర శిక్ష పథకం కింద కేరళకు ఇవ్వాల్సిన రూ.1160 కోట్ల నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదు. మూడేండ్లుగా నిధులను పూర్తిగా విదల్చటం లేదు. సాక్షాత్తూ కేంద్రం పార్లమెంటులో ఈ సమాధానాన్ని వెల్లడించింది. సీపీఐ(ఎం) రాజ్యసభపక్ష నేత జాన్‌ బ్రిట్టాస్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాన్ని తెలిపారు.అయితే మంత్రి సమాధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన సమాధానంలో ప్రత్యక్షంగా చెప్పకపోయినా.. పీఎం-శ్రీ పథకంపై ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు విడుదలవుతున్నాయనే సంకేతం మాత్రం ఇచ్చారు. కాంగ్రెస్‌ పాలిత మూడు రాష్ట్రాలు ఇప్పటికే సంతకం చేశాయని చెప్పారు.

అంటే.. ఎల్‌డీఫ్‌ పాలనలో ఉన్న కేరళ కూడా పీఎం-శ్రీ ఒప్పందం చేసుకుంటేనే నిధులు వస్తాయన్న భావన మంత్రి ప్రకటనలో స్పష్టమవుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పథకం అనేది విద్య కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి నడిపే స్కీం. కేంద్రం దీనిని 2018లో ప్రారంభించింది. ఇందులో కేంద్రం, రాష్ట్రం వాటా 60:40గా ఉంటుంది. ఇది జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) – 2020 కింద అమలవుతోంది. కానీ 2022లో వచ్చిన పీఎం శ్రీ ఒప్పందం చేయకపోతే ఎస్‌ఎస్‌ఏ నిధులు ఇవ్వబోమని కేంద్రం షరతు విధిస్తోందని బ్రిట్టాస్‌ ఆరోపించారు. ”రాష్ట్రాలు 40 శాతం వ్యయం భరిస్తున్న పథకానికి కొత్త పథకాల ఒప్పందం తప్పనిసరి చేయడం అన్యాయం. ఇది రాజకీయ జోక్యానికి నిదర్శనం” అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా 2023-24, 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కేరళకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా రాలేదు. కేంద్రం షేరు మొత్తంలో రూ.1160 కోట్లకు పైగా నిధులు ఇంకా విడుదల కాలేదని కేరళ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

విద్యార్థులకు అన్యాయం
కేంద్రం నుంచి నిధులు రాని కారణంగా దాని ప్రభావం రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై పడుతున్నది. పాఠశాలల్లో ఇవ్వాల్సిన యూనిఫామ్‌లు, పుస్తకాలు, ప్రత్యేక సౌకర్యాలు, స్కూల్‌ బిల్డింగ్‌ మరమతులు, విద్యా హక్కు చట్టం కింద ఉపయోగపడే అనేక సేవలు నిరవధికంగా నిలిచిపోయాయి. ఎస్సీ, ఎస్టీ, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండే పిల్లల హక్కుల కింద వచ్చే అనేక సదుపాయాలు ఆగిపోయాయి. రాష్ట్రం ఇప్పటికే కేంద్రం నిధులు లేకుండా పాఠశాలల నిర్వహణను సాగిస్తున్నది. తాము కేంద్రానికి అవసరమైన పత్రాలు అందించినప్పటికీ కేంద్రం మాత్రం నిధులు ఇవ్వడం లేదని కేరళ ప్రభుత్వం చెప్పింది. తమకు రావాల్సిన నిధులను ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే ఈ విషయంలో గడిచిన నవంబర్‌లో రాష్ట్ర మంత్రి వి.శివన్‌ కుట్టి కేంద్రానికి ఒక ఓపెన్‌ లేఖ రాశారు. మిగిలిన బకాయిలు విడుదల చేయాలని వివరించారు. కేంద్రం తీరు విద్యార్థుల హక్కులకు అవమానం కలిగించేదిగా ఉన్నదని తప్పుబట్టింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -