నవతెలంగాణ – హైదరాబాద్ : టెస్టు సారథిగా తొలి సిరీస్‌లోనే చెరిగిపోని ముద్ర వేస్తున్నాడు శుభ్‌మన్ గిల్. క్రీడా దిగ్గజాలను ఆశ్చర్యపరుస్తూ.. అభిమానులను ఆనందంలో ముంచెత్తుతూ టీమిండియా కెప్టెన్‌గా కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాడీ యువకెరటం. ఇంగ్లండ్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ తొలి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన గిల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు.
లంచ్‌కు ముందు క్రీజులోకి వచ్చిన గిల్.. క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు ఆధిక్యాన్ని పెంచుతూనే వ్యక్తిగత మైలురాయికి చేరువయ్యాడు. బషీర్ ఓవర్లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్‌కు చేరువయ్యాడు. దాంతో, ఒకే టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీ బాదిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. సునీల్ గవాస్కర్ 1971లో మొదట ఈ ఫీట్ సాధించాడు. మొత్తంగా ఆటగాడిగా ఈ ఘనత సొంతం చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా ప్రిన్స్ నయా చరిత్ర లిఖించాడు.