రూ. 3.69 లక్షల కోట్ల నిధులకు బదిలీ చేయని మోడీ సర్కార్ : కాగ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : విద్యా, ఆరోగ్యం, చమురు పరిశ్రమ అభివృద్ధి.. వంటి వాటి కోసం చేస్తున్న సెస్ వసూళ్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన గుప్పెట్లోనే ఉంచుకుంది. వాటిని సంబంధిత నిధులకు బదిలీ చేయడం లేదు. ఈ విషయాన్ని మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. సెస్ అనేది పన్నులకు అదనంగా విధించబడే లెవీ, దీనిని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఉపయోగించాల్సి ఉంటుంది. కాగ్ నివేదిక ప్రకారం 2023-24 నాటికి రూ.3.69 లక్షల కోట్ల సెస్ వసూళ్లను సంబంధిత నిధులకు కేంద్రం బదిలీ చేయలేదు. విద్య, రక్షణ, జాతీయ రహదారులు, చమురు పరిశ్రమ అభివృద్ధి, ఆరోగ్యం వంటి వాటి కోసం విధించిన సెస్‌లను కేంద్ర ప్రభుత్వం వాటికి బదిలీ చేయలేదని నివేదిక తెలిపింది. 1974 నుంచి దేశంలో సెస్‌లను అమలు చేస్తున్నారు. సెస్ వసూళ్లలో ఎక్కువగా బదిలీ కావాల్సిన వాటిలో ఆయిల్ ఇండిస్టీ డెవలప్‌మెంట్ బోర్డు (ఓఐడీబీ) ముందు ఉంది. చమరు పరిశ్రమ (అభివృద్ధి) చట్టం 1974 ప్రకారం ఓఐడీబీను ఏర్పాటు చేశారు. దీనికి నిధులను బదిలీ చేయడం కోసం ముడిచమురు, సహజ వాయువుపై సెస్సు విధిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం 1974-75 నుంచి ఆర్థిక సంవత్సరం 2023-24 వరకూ ముడి చమురుపై ప్రభుత్వం మొత్తం రూ. 2,94,850.56 కోట్ల సెస్‌ను వసూలు చేసినట్లు కాగ్ తన నివేదికలో పేర్కొంది. అయితే 1974-75 నుంచి 1991-92 వరకూ ప్రతీ ఏడాది వసూలు చేసిన సెస్ నుంచి రూ.902.40 కోట్లను మాత్రమే కేంద్రం ఓఐడీబీకి బదిలీ చేశారు. తరువాత నుంచి ప్రతీ ఏడాది సెస్ వసూలు చేస్తున్నా ఓఐడీబీకి ఎటువంటి నిధులను బదిలీ చేయలేదని కాగ్ తెలిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే వసూలు సెస్ నుంచి కేవలం 0.3 శాతాన్ని మాత్రమే సంబంధిత నిధికి బదిలీ చేసిందని కాగ్ విమర్శించింది.
ఆరోగ్యం, విద్య కోసం వసూలు చేస్తున్న సెస్‌లను కూడా సంబంధిత నిధులకు కేంద్ర బదిలీ చేయడం లేదని కాగ్ తెలిపింది. 2004 ఏప్రిల్ 1 నుంచి వేసూలు చేసే అన్ని పన్నులపై 2 శాతం విద్యా సెస్‌ను కేంద్రం విధించింది. ఇక 2007 నుంచి ఆదాయ పన్ను, సర్‌చార్జిపై అదనంగా 1 శాతం మాధ్యమిక, ఉన్నత విద్యా సెస్‌ను కూడా కేంద్రం విధించింది. ఈ తరువాత అంటే 2018 ఏప్రిల్ 1 నుంచి ఈ రెండు సెస్‌లను తొలగించి వాటి స్థానంలో ఆరోగ్యం, విద్యా సెస్‌ను ప్రవేశపెట్టి 4 శాతం సెస్‌ను వసూలు చేస్తోంది. ఈ సెస్ వసూళ్లను ప్రారంభిక్ శిక్షా కోష్ (పీఎస్‌కే), మాధ్యమిక ఉచ్ఛతర్ శిక్షా కోశ్ (ఎంయూఎస్‌కే), ప్రధాన్‌మంత్రి స్వాస్థ్య సురక్షా నిధి (పీఎంఎస్‌ఎస్‌ఎన్)కు బదిలీ చేయాలి. అయితే 2028-19 నుంచి 2023-24 వరకూ వసూలు చేసిన సెస్ మొత్తం రూ. 37,537 కోట్లను సంబంధిత నిధులకు బదిలీ చేయలేదని కాగ్ తెలిపింది. అలాగే ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్‌కు రూ.2,505.5 కోట్లను, మానిటైజేషన్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఫండ్‌కు రూ. 5,968.1 కోట్లను కేంద్రం బదిలీ చేయాల్సి ఉందని కాగ్ తెలిపింది.
కేంద్రం గుప్పెట్లోనే సెస్ వసూళ్లు
- Advertisement -
- Advertisement -