Monday, September 22, 2025
E-PAPER
Homeదర్వాజఆధునిక తరాన్ని స్పర్శిస్తూ..వర్షించే చందలూరి కవిత్వం..!

ఆధునిక తరాన్ని స్పర్శిస్తూ..వర్షించే చందలూరి కవిత్వం..!

- Advertisement -

”సుమారుగా ప్రతిరోజు ఏదో సమస్యను, సందర్భాన్ని ప్రేమిస్తూ నా అక్షరం నన్ను ఖాళీగా ఉంచదు. నా గుండె గూటిలో రాత్రింబవళ్లు ఏదో చప్పుడు చేస్తూనే ఉంటుంది. నా మునివేళ్ళు కవాతు చేస్తూనే ఉంటాయి. ఏ పనిలో ఉన్నా ప్రతిక్షణం ఏదో ఓ భావం కవితాకతి పొందాలనే చూస్తుంది.ఓ తవ్వకంలా మారిన ఆలోచన వ్యసనమై పదునైన వాక్యం కోసం వెంటపడుతూనే ఉంటుందంటూ ”ఇంట్రో…” ఆరంభంలోనే తన జీవిత కవిత్వ గాఢతలో పాఠకుల్ని ముంచేస్తారు చందలూరి నారాయణరావు. 30 ఏళ్ల సాహిత్య ప్రయాణం ఇలాంటిదే మరి. అందుకేనేమో ఆయన అక్షరాలు మనకు సాహితీ పత్రికల్లో కనిపిస్తూ మనలోని కవిత్వాన్ని కవిత్వీకరించేలా చేస్తుంటాయి. కాలం చేస్తున్న ఆధునిక సాంకేతిక సంతకాల కవితా గగనంలో నవతరపు రాతలను గమనిస్తూనే ఉంటారు రచయిత. అందుకే చిక్కదనంతో బాటు,చిన్నచిన్న పదాలతోనే విభిన్నతకు జీవం పోస్తుంటారు.

”ప్రపంచమొక పద్మవ్యూహం కవిత్వమొక తీరని దాహం”అన్న మహాకవి శ్రీశ్రీ అక్షరాగ్ని శిఖరాలకు చందలూరి ”ఏకాంత స్పర్శ” కవిత్వం ఓ నిదర్శనం. ఏ రంగు, రుచి,వాసన లేకుండా పెంచుకున్న ఆయన అక్షరం ఆయన మనసు విలువను నిక్కచ్చిగా నిజాలతో తూచి మనల్ని చదివించి మనతో వినిపించాలనేదే రచయిత తాపత్రయం. కాలం చర్మం ఒలిచి/ కాగితంపై తరాలని తవ్వి/ కుప్పలుగా పోసి/ గాజు కళ్ళు చేసిన సంతకంలో…/ చిరునామాతో పనిలేని/ అవసరంతో నిమిత్తం లేని/ రోజు వ్రాయబడే ఉత్తరమే అమ్మంటూ, పాఠక లోకానికి అమ్మ ప్రేమను చూపిస్తున్నారు. అమ్మకు అక్షరాభిషేకం చేస్తున్నారు. ”ఖాళీ స్థలంలో” వేల జ్ఞాపకాల కొలనులో తలుపులు, గోడలు, కప్పు, ఆకారాలను వెతుకుతుంటారు. రోజూ కురిసే చీకటిలో కాసేపు తన పడక వీధిలో పరిగెత్తే ఆలోచనల అక్షరాలను తడిపి ”నిద్ర పూవు”ను కానుకగా ఇస్తారు.

నిద్ర ఓ ఆనంద నౌకగా, ఓ అఖండ తేజంగా, తాజాదనపు అదష్టంగా అభివర్ణిస్తారు. నీవు నీ నుండి విడిపోయినా సరే, నీతో కలిసి చేసే ప్రయాణమే ఏకాంతమంటూ, మనిషెత్తు తపనను పారించి పదునెక్కిన మనసుతో బతుకును జీవితంగా ఆవిష్కరిస్తారు. ఆమెను చేరాలన్న ఓ నిజం లో తెలియని ఊహా ప్రపంచంలో ఊపిరి ఉంటుందో లేదో కూడా తెలియకుండా ”ఆమె” ఆలోచన సంద్రంలోనే అన్వేషిస్తుంటారు. నారాయణరావు గుండెల నిండా శ్రీ శ్రీ రూపం దాగుంది. పదునెక్కిన కవిత్వం రాస్తున్నప్పుడు ఆయన గుండె శబ్దాలు లబ్‌ డబ్‌ బదులు ”శ్రీశ్రీ” అనే కొట్టుకుంటాయి. అందుకే గుండెలో రక్తాన్ని ఊగించే ఆవేశంతో… తెలుగు వెలుగులల్లిన అగ్రస్థానం. ఆ కవిదే తెలుగు వారిలో సాగుతున్న మహాప్రస్థాన మంటారు. దేశం దేహంపై/ పదవి పెదవి గాట్లతో/ రాజకీయం నగంగా/ సిగ్గును తాకట్టు పెట్టి/ అధికారం సాధించుకున్నదని ఆందోళన పడుతుంటారు. లోకంలో ఎక్కడా దొరకని పరిజ్ఞానం/ ఏ చదువు చెప్పని విజ్ఞానం/ నాయనమ్మ చెప్పే కబుర్ల/ గుబుర్లో దాగి ఉందంటూ, తాతయ్య చేతి కర్ర చెప్పే కథలను కవిత్వంగా అందించారు. పుట్టుకతోనే పాడె మోస్తూ భూమికి బరువైన కన్నీటి బొట్టు అతడంటూ రైతు జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ, ఎప్పటికైనా లోకం అతని కాళ్ళను తలచుకొని భారీ మూల్యానికి సిద్ధం కాక తప్పదంటూ హెచ్చరిస్తారు.

ప్రతి మనిషి జీవితంలో బాల్యం విలువను తెలియజేస్తూ అద్భుతమైన కవిత రాశారు చందలూరి. నోటి నిండా తీయని పలుకుల్ని/ కళ్లనిండా మెరుపుల కాంతుల్ని/ ముఖంలో ఆనందపు గెంతుల్ని/ చురుకుదనం పంచే చైతన్యాన్ని/ చెబుతూనే ప్రతి మనిషి మొదట కుబేరుడే అంటారు. మనం కాసేపు మాట్లాడుకుందామంటూ మొదటిసారి పలకరించారు. మనిషి గుర్తుల్ని బతికించుకుందామంటూ రెండో సారి మనలోని మానవీయ కోణాన్ని మెల్కొలిపి బతుకు పాఠాన్ని చెప్పారు. ఇప్పుడు ఏకాంత స్పర్శతో మళ్లీ మన మెదడులోకి మన గుండెలోకి మనకు తెలియకుండానే చేరిపోతున్నారు. చందలూరి కవిత్వంలో మనిషితనాన్ని ఆకర్షించే లక్షణం ఉంది. మానవతను ప్రబోధించే విప్లవ గుణం ఉంది. బడుగు బలహీన వర్గాల గొంతుకై ప్రశ్నించే తపన ఉంది. ఇలా ఇంతసేపు చెప్పుకుంటూ వెళ్లినా…ఆయన అక్షరాల్లో మనందరికీ దొరకని ఓ మ్యాజిక్‌ ఉంది. ఓ లాజిక్‌ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా ఆయన ఏకాంత స్పర్శతో కరచాలనం చేస్తూ, ఇంకా ఎన్నో పుస్తకాల రూపంలో వారి అక్షరాలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అభినందనలు తెలుపుదాం.

ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌
9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -