Tuesday, January 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేరు మార్పు.. పొట్ట నింపదు

పేరు మార్పు.. పొట్ట నింపదు

- Advertisement -

దేవుళ్లకు రాజకీయాలు అంటగట్టడం ఏంటీ..?
పేదవారి స్థితిగతులు మార్చాలి
కవిత ఆరోపణలకు కేటీఆర్‌, హరీశ్‌రావు సమాధానం ఇవ్వాలి : టీపీసీసీ అధ్యక్షులు
బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘కేంద్రంలో 12 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా.. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురాలేదు కానీ పేర్లు మారుస్తరంట.. ఉపాధి హామీ చట్టం పేరు మార్పు పేదలకు బువ్వ పెట్టదు.. ఎన్నికలు వస్తే హిందు, ముస్లిం పేరిట బీజేపీ చేసే విద్వేష రాజకీయాలు సమాజానికి మంచిది కాదు. భవిష్యత్‌ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. కులం, మతం పక్కనబెట్టి పేదవారి జీవిత స్థితిగతులు మార్చాలి. దేవుడి పేరుతో ఓట్లడిగే వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి’ అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

పదేండ్లపాటు కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఆ తర్వాత ఫామ్‌హౌస్‌కి పలాయనం చిత్తగిస్తే.. రెండేండ్ల కాంగ్రెస్‌ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులందరి సహకారంతో రాష్ట్రం వికాసం వైపు పయనిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 60 శాతం స్థానాలు కాంగ్రెస్‌ మద్దతుదారులే గెలిచారని, ఫిబ్రవరిలో రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో దాదాపు 90 శాతం సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఇప్పటి వరకు 24 నెలల్లోనే 80 వేల ఉద్యోగాలిచ్చామని, మూడేండ్ల కాలంలో మిగతా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్‌.. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అన్నారు. దేవుని పేరును వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాముడేమైనా బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా..? దేవుళ్లకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని అన్నారు. 12 ఏండ్లలో చేసిన అభివృద్ధి గురించి చెప్పి బీజేపీ ఓట్లడగాలని హితవు పలికారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు రాకుండా అడ్డుకున్నది బీజేపీనే అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కథ ముగిసిందని.. ముందు కవిత ఆరోపణలకు కేటీఆర్‌, హరీశ్‌రావు సమాధానాలు ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, నుడా చైర్మెన్‌ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు నగేశ్‌రెడ్డి, కార్పోరేషన్‌ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, ఆర్మూర్‌ ఇన్‌చార్జి వినయ్ కృష్ణరెడ్డి, శేఖర్‌గౌడ్‌, అరికెల నర్సారెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -