సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం
సీసాలు, కుర్చీలు విసిరేసిన అభిమానులు
క్షమాపణ చెప్పిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
అదుపులోకి నిర్వాహకులు
కోల్‌కతా : ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియొనెల్ మెస్సీ భారత్ పర్యటనలో భాగంగా శనివారం కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఈ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఆయన ఉన్న 20 నిమిషాలు కూడా ఎవరికీ సరిగా కనిపించకపోవడంతో వేలాదిమంది అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్టేడియంలోకి సీసాలు, కుర్చీలు విసిరేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ అభిమాన క్రీడాకారుడిని కాసేపైనా చూడాలనే కోరికతో ఎక్కువ డబ్బులు పెట్టి మరీ టిక్కెట్లు కొనుక్కుని వచ్చినా ఫలితం లేకపోవడంతో వారిలో కోపం పెల్లుబికింది. ఉదయం 11.30గంటల సమయంలో మెస్సీ కాన్వారు స్టేడియంలోకి ప్రవేశించింది. మెస్సి వెంట మరో ఇద్దరు ఫుట్‌బాలర్లు లూయిస్ సారెజ్, రొడ్రిగొ డీ పాల్ ఉన్నారు. అయితే మెస్సీ కోసం ఒక్క కోల్‌కతా నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది ఇక్కడకు వచ్చారు. దీంతో స్టేడియం అశేష జనసందోహంతో కిక్కిరిసిపోయింది.
మెస్సీ చుట్టూ గుమిగూడిన ప్రముఖులు
మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే దాదాపు 70 నుంచి 80 మంది వ్యక్తులు ఆయన చుట్టూ గుమిగూడారు. వీరిలో ఈవెంట్ నిర్వాహకులతో పాటు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్, ఫుట్‌బాల్ క్లబ్‌ల ప్రతినిధులు కూడా ఉన్నారు. తమ అభిమాన క్రీడాకారుడితో ఫొటోలు, సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంలో వారు బిజీ అయిపోయారు. ఫలితంగా స్టేడియం గ్యాలరీల్లో వున్న వారెవరూ మెస్సీని చూడలేక పోయారు. ఒకదశలో వారు ‘వి వాంట్ మెస్సీ’ అని గట్టిగా నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో గందరగోళం నెలకొంటుందనే భయంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇంకా స్టేడియం వద్దకు రాకుండానే 11.52 గంటల సమయంలో మెస్సీని స్టేడియం నుంచి బయటకు తీసుకువచ్చేశారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం
మెస్సీ స్టేడియం నుంచి బయటకి వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్యాలరీలోని కుర్చీలు లాగి స్టేడియంలోకి విసిరేశారు. మంచినీళ్ళ సీసాలు పడేశారు. ఫెన్సింగ్ గేటును విరిచేశారు. లోపలకు పెద్ద పెట్టున తోసుకువచ్చేశారు. వందలాదిమంది స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ వున్న తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. కొన్నింటికీ నిప్పు కూడా పెట్టారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో కొద్దిసేపు స్టేడియంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేడియం వెలుపల కూడా వేలాదిమంది అభిమానులు గుమిగూడి నిర్వాహకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరైన ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు.
సీఎం మమతా బెనర్జీ క్షమాపణ
కాగా ఈ దురదృష్టకర సంఘటనపై క్రీడాభిమాను లకు, ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణ చెప్పారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. సాల్ట్ లేక్ స్టేడియం వద్ద జరిగిన నిర్వహణా లోపాలు తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. తాను స్టేడియంకు వచ్చేలోగానే ఈ ఘటన జరిగిపోయిందని ఆమె ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. మెస్సీకి కూడా క్షమాపణలు తెలిపారు.
విచారణా కమిటీ ఏర్పాటు
జస్టిస్(రిటైర్డ్) అసిం కుమార్ రే నేతృత్వంలో విచారణా కమిటీని ఏర్పాటు చేసినట్టు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. హోం వ్యవహారాల చీఫ్ సెక్రెటరీ, అదనపు చీఫ్ సెక్రెటరీలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
నిర్వాహకులు అదుపులోకి
ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్టు బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే టిక్కెట్లు కొనుక్కుని తమ అభిమాన క్రీడాకారుడిని చూడలేక నష్టపోయిన అభిమానులకు తగిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. అయితే ఎవరికీ ఎక్కడా గాయాలు కాలేదన్నారు.
మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం..ఉద్రిక్తత
- Advertisement -
- Advertisement -



