నవతెలంగాణ-హైదరాబాద్: పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్లు షో పడ్డాయి. ప్రీమియర్ షో చూడ్డానికి హైదరాబాద్‌కు చెందిన రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్ సంధ్య థియేటర్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోయింది. శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనకు సంబందించి తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసులు 23 మంది నిందితులను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారించారు. పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా.. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా చేర్చారు. ముగ్గురు మేనేజర్లు , 8 మంది బౌన్సర్లను సైతం ఛార్జ్ షీట్‌లో చేర్చారు. అంతేకాదు నలుగురు ప్రత్యక్ష సాక్షులను కూడా పోలీసులు ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. 2024 డిసెంబర్ నెలలో తొక్కిసలాట ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.



