– బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించని రేవంత్ సర్కార్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య
– రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడి
నవతెలంగాణ-మెహిదీపట్నం
రోజూ బీసీల జపం చేస్తూ మరోవైపు బీసీ విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా రేవంత్ ప్రభుత్వం వారిని మోసం చేస్తున్నదని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.6000 కోట్లు వెంటనే చెల్లించాలని, బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలని, ప్రయివేటు యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. స్కాలర్‌షిప్, ఫీజు బకాయిల డబ్బులు చెల్లించకుండా ప్రభుత్వం బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నదని అన్నారు. అనేక స్కీములకు లక్షల కోట్లు అప్పు తెస్తున్న ప్రభుత్వం లక్షలాదిమంది బీసీ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే స్కాలర్‌షిప్, ఫీజు బకాయిలు చెల్లించడానికి రూ.6000 కోట్ల అప్పు తెస్తే ఎవరు అడ్డుకుంటారని ప్రశ్నించారు. స్కాలర్‌షిప్స్ బకాయిల కోసం బడ్జెట్‌లో రూ.5000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల నిమిత్తం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నదని, మరి ఆ డబ్బులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రమైన ఏపీలో రెండు దఫాలుగా రూ.1500 కోట్లు విడుదల చేశారని, కానీ మన రాష్ట్రంలో స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా బీసీ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు చెల్లించాలని కాలేజీ యాజ మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సు పూర్తయినా వారికి సర్టిఫికెట్ ఇవ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజుల స్కీమ్‌ను పునరుద్ధరించాలని, అలాగే ప్రయివేటు యూనివర్సిటీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరే కంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు గుజ్జ కృష్ణ, నీలం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల జపం చేస్తూనే మోసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES