Tuesday, October 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతనిఖీలు చేస్తున్నా.. నిర్లక్ష్యం వీడరే..!

తనిఖీలు చేస్తున్నా.. నిర్లక్ష్యం వీడరే..!

- Advertisement -

– మారని ప్రయివేట్‌ బస్సు ఆపరేటర్ల తీరు
– ధనార్జనే లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం!
– ‘కర్నూలు’ ఎఫెక్ట్‌.. రవాణా శాఖ విస్తృత తనిఖీల్లో బయటపడుతున్న నిర్లక్ష్యం
– ఇప్పటివరకు 5 బస్సులు స్వాధీనం.. 143 బస్సులపై కేసులు
– రూ.3.06 లక్షల జరిమానా వసూలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

కర్నూలు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ప్రయివేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని మరోసారి కండ్లకు కట్టింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో మేల్కొన్న రవాణా శాఖ అధికారులు గ్రేటర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల భద్రతను గాలికొదిలేసి, నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న అనేక బస్సుల డొల్లతనం ఈ తనిఖీలలో బయటపడింది. అయితే, అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా.. ప్రయివేట్‌ బస్సు ఆపరేటర్స్‌ మాత్రం.. తమ బస్సుల్లో ఉన్న లోపాలను సవరించుకోవడం కానీ.. కనీస జాగ్రత్తలు తీసుకోవడం కానీ చేయడం లేదు. వాటితోనే రోడ్డెక్కడం అందరినీ కలవర పెడుతోంది.

ఉల్లంఘనలు ఇలా..
అనేక ప్రయివేట్‌ బస్సులు భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదని ఆర్టీఏ అధికారులు గడిచిన మూడ్రోజులుగా నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలలో తేలింది. అగ్నిమాపక పరికరాల (ఫైర్‌ సేఫ్టీ సిలిండర్లు) లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. చాలా బస్సుల్లో ఫైర్‌ సేఫ్టీ సిలిండర్లు లేకపోవడం, ఉన్నచోట డమ్మీ సిలిండర్లు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. మరికొన్నింటిలో గడువు ముగిసినవిగా తేలింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు బయటపడటానికి వీలుగా ఉండే ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్లకు అడ్డంగా బెడ్లు, ఇతర సామాగ్రిని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అంతేగాక ప్రమాద సమయాల్లో కిటికీ అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే హామర్స్‌(సుత్తులు) చాలా బస్సులలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. కర్నూలు ఘటన తర్వాత ప్రయాణికులందరిలో ఒకరకమైన భయాందోళన నెలకొంది.

ప్రభుత్వానికి నివేదిక
కర్నూలు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు జరిపి, క్షేత్రస్థాయిలో చేపట్టిన తనిఖీలలో వెలుగుచూసిన ఉల్లంఘనలపై ప్రభుత్వానికి రాష్ట్ర ఆర్టీఏ అధికారులు నివేదికను అందించినట్టు సమాచారం. బస్సుల్లో ఫైర్‌ అలారం, గ్లాస్‌ బ్రేక్‌ హామర్స్‌ వంటి కనీస భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకోవడం, నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారానే ప్రమాదాలను నివారించొచ్చని రవాణారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే కాకుండా, నిరంతరం తనిఖీలు చేపట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించే బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కెపాసిటీకి మించి ప్రయాణికులు
అనేక బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు లేవని, డిజైన్లలో మార్పులు చేశారని, కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని అధికారులు తేల్చారు. నిబంధనల ప్రకారం ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సిన చోట ఒకే డ్రైవర్‌తో సుదూర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రయివేట్‌ ట్రావెల్స్‌ యాజమాన్యాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. వారిలో మార్పు కనిపించడం లేదని తెలుస్తోంది. గ్రేటర్‌ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో వందలాది బస్సులపై కేసులు నమోదు చేసి, లక్షలాది రూపాయల జరిమానాలు విధించారు. అగ్ని ప్రమాద నిరోధక చర్యలు లాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదు. అగ్నిమాపక యంత్రాలు లేకుండా వందల కిలోమీటర్ల మేర బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. కర్నూలు ఘటన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని రోజులపాటు ఈ తనిఖీలు కొనసాగించనున్నారు. మూడ్రోజులుగా రవాణా అధికారులు 200-300కుపైగా బస్సులను తనిఖీ చేసి.. 143 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందులో 5 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. ఆయా బస్సుల నుంచి కాంపౌడింగ్‌ ఫీజు కింద రూ.3.06లక్షల వరకు జరిమానా వసూలు చేశారు. ఈ తనిఖీల పరంపర కొనసాగుతుందని, ప్రయాణికుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -