– అదును కోసం ‘తాటికొండ’
– వ్యూహాత్మకంగా ‘కడియం’
– సుప్రీం ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
– తాజా పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో గందరగోళం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. స్పీకర్ కూడా పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు అందించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టించడంతో ఎన్నికల కోసమే ఇందంతా అన్న పద్ధతిలో చర్చ నడుస్తోంది. మరో వైపు.. బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య.. ‘కడియం’పై రాజకీయ విమర్శలే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉప ఎన్నికల్లో తనదే గెలుపంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలు ఉంటాయో లేదో తెలియదు కానీ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు.. కొలిక్కి రాకముందే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరిన విషయమై ‘సుప్రీం’లో ఉన్న కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ మరో పిటీషన్ వేయడానికి నోటీసులందుకున్న ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నాడు కాంగ్రెస్, టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన కేసులో ఎలాంటి తీర్పునివ్వ నున్నారనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉందని ఈ ఎమ్మెల్యేలు ‘సుప్రీం’ను ఆశ్రయించడానికి రంగం సిద్ధం చేసు కున్నారు. ఒకవైపు నియోజకవర్గంలో తిరుగుతూ మరోవైపు న్యాయపరంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
అదును కోసం ‘తాటికొండ’
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అదును కోసం చూస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే తమదే విజయమని తాటికొండ వర్గీయులు ప్రకటనలు చేశారు. కడియం శ్రీహరిపై రాజయ్య విమర్శల పర్యం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్‌ఎస్ నేతలు ప్రచారం చేశారు.
పార్టీ కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలకే రాజయ్య ప్రాధాన్యత ఇస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీలో నెలకొన్న పరిస్థితులు ఎటు దారితీస్తాయోనని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉందని రాజయ్య వర్గీయులు అంటున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కుదుటపడకపోతే ఈలోపు ఉప ఎన్నికలు వస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచిన కడియం
సుప్రీంకోర్టు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి పార్టీ ఫిరాయిం చిన ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధి కార్యక్రమాల్లో వేగాన్ని పెంచారు. ఉప ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే నియోజకవర్గంలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు మార్చి నెలలో సీఎం రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో తొలిదశలోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేశారు.
జఫర్‌గఢ్ మండలం కోనా యిచలం వద్ద ఈ భవనాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తు న్నారు. రూ.45.50 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో 100 పడకల ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నారు. దేవాదుల ప్రాజెక్టు రెండో దశ పనులకు రూ.148.76 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పలు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయించి సాగునీటిని విడుదల చేస్తూ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికే తాను బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరానని చేసిన ప్రకటనను నిజమని చెప్పడానికి ‘కడియం’ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
‘స్టేషన్’లో చదరంగం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES