15 బంతుల్లోనే అర్థ సెంచరీ
సఫారీ అండర్-19పై కుర్రాళ్ల గెలుపు
బెనోని (దక్షిణాఫ్రికా) : యువ కెరటం వైభవ్ సూర్యవంశీ మరో రికార్డు బద్దలుకొట్టాడు. యూత్ వన్డేల్లో వేగవంతమైన అర్థ సెంచరీ నమోదు చేశాడు. 2016 అండర్-19 ప్రపంచకప్‌లో రిషబ్ పంత్ నెలకొల్పిన రికార్డును సూర్యవంశీ అధిగమించాడు. 10 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 68 పరుగులు చేసిన సూర్యవంశీ.. 15 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. అభిజ్ఞాన్ (48 నాటౌట్, 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), వేదాంత్ త్రివేది (31 నాటౌట్, 57 బంతుల్లో 4 ఫోర్లు), ఆరోన్ జార్జ్ (20, 19 బంతుల్లో 3 ఫోర్లు) సైతం రాణించటంతో 174 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ అండర్-19 జట్టు 23.3 ఓవర్లలోనే ఊదేసింది. మరో 21 బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అండర్-19 నిర్ణీత 50 ఓవర్లలో 245 పరుగులు చేసింది. జేసన్ రోవెల్స్ (114, 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో మెరిశాడు. వర్షం అంతరాయంతో భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 27 ఓవర్లలో 174 పరుగులుగా సవరించారు. వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. మూడు యూత్ వన్డేల సిరీస్‌లో 2-0తో భారత్ అండర్-19 సిరీస్ విజయం సాధించింది. నామమాత్రపు మూడో యూత్ వన్డే బుధవారం జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం భారత కుర్రాళ్లు ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ వేటకు నమీబియా, జింబాబ్వేకు పయనం కానున్నారు.



