Wednesday, August 6, 2025
E-PAPER
Homeమానవివానాకాలం పిల్ల‌లు భ‌ద్రం

వానాకాలం పిల్ల‌లు భ‌ద్రం

- Advertisement -

చిటపట చినుకుల్లో తడవడం, బురద నీటిలో గంతులేయడం, పారే నీటిలో పడవలు చేసి వదలడం ఇలాంటివి ఎంత వద్దన్నా చిన్నారులు చేసే పనులు. నీటితో తనివితీరా ఆడుకోవచ్చనే ఉద్దేశంతో వర్షాకాలం అంటే తెగ ఇష్టపడతారు పిల్లలు. ఈ కాలంలో కేవలం వానలేనా, అవి మోసుకొచ్చే అనారోగ్య సమస్యలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. మరి వాటి బారిన పిల్లలు పడొద్దంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
వర్షాకాలం అనగానే పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. ఫ్లూ, శ్వాసకోశ సంబంధ సమస్యలు లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయి. వీటి బారిన పిల్లలు పడకుండా ఉండాలంటే వాటర్‌ వేడి చేసుకొని, ఫిల్టర్‌ చేసుకొని తాగడం మంచిది. బయట ఫుడ్‌కు దూరంగా ఉండాలి. దోమలు ఇంట్లోకి రాకుండా దోమ తెరలు వాడడం ఉత్తమమైన పద్ధతి. ముఖ్యంగా ఇంట్లో వాటర్‌ నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి.

నీళ్లు తాగించండి
వాతావరణం చల్లగా ఉంటే నీళ్లు తాగాలన్నా సంగతి పెద్దలకే గుర్తు ఉండదు. ఇక పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పిల్లలు నీళ్లు తాగట్లేదు కదా అని వదిలేయకుండా, తప్పక వారిచేత రోజుకు తగినన్ని నీళ్లు తాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే శరీరంలోని మలినాలు బయటకు పోతాయని తెలుపుతున్నారు. అవసరమైతే కాచి, వడకట్టి ఇవ్వాలని, ఒకవేళ చలిగా ఉంటే గోరువెచ్చని నీటిని తాగిస్తే ఇంకా మంచిదని పేర్కొంటున్నారు. వీటివల్ల గొంతు ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వగైరా దరిచేరకుండా ఉంటాయని వివరిస్తున్నారు.

ఆహారం జాగ్రత్త
వర్షాకాలం జంక్‌ఫుడ్‌, బయటి ఆహారాలకు చిన్నారులను దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున పాడైన, నిల్వ ఉన్న ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు. వేడి వేడి సూపులు, పాలు, పెరుగు, స్మూతీలు వంటివి ఇవ్వాలని, కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు, కాయగూరలను ఎక్కువగా తినిపించాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా విటమిన్‌ సి ఎక్కువగా దొరికే నిమ్మ, నారింజ, క్యారెట్‌, జామ వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని, ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందివ్వడమే కాకుండా, రోగనిరోధకతను పెంచడంలోనూ సాయపడతాయని తెలుపుతున్నారు.

ఇలాంటివి వేయండి
వాతావరణం చల్లగా ఉంటే పిల్లలు స్నానం చేయనని మారాం చేస్తుంటారు. కానీ, రోజూ వేడినీటితో స్నానం తప్పనిసరని, వానలో తడిచినప్పుడు చేయిస్తే మరీ మంచిదంటున్నారు నిపుణులు. అలాగే శానిటైజర్‌తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా చూడాలని, అంతేకాకుండా శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులనే వేయమని, ఒకవేళ వానలో తడిచినా వెంటనే బట్టలు మార్పించాలని, లేదంటే ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయని చెబుతున్నారు. చెప్పులు, షూ విషయంలోనూ ఈ జాగ్రత్త తప్పనిసరంటున్నారు. అలాగే బయటికి వెళ్లేటప్పుడు రెయిన్‌కోట్‌, గొడుగుతో పాటు మోకాలి వరకు ఉండే గమ్‌ బూట్లను వేస్తే మరీ మంచిదని వివరిస్తున్నారు.

ఆడించండి కానీ…
వానలు, చల్లదనానికి శరీరం స్తబ్ధుగా అనిపిస్తుంది. అలాగని ఊరుకుంటే ఆకలి మందగించడమే కాదు పిల్లలు బద్ధకంగానూ తయారవుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వ్యాయామం తప్పనిసరంటున్నారు. కనుక ఇంట్లోనే డ్యాన్స్‌, ఆటలతో పాటు చిన్న చిన్న వ్యాయామాలు ప్లాన్‌ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బోర్డు గేమ్స్‌, పజిల్స్‌, క్రాఫ్ట్‌లతో పాటు కథలు, యాక్టివిటీ పుస్తకాలు తెచ్చిస్తే పిల్లలకు కాలక్షేపం అవుతుందని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
జ్వరం, జలుబు, దగ్గు సహా పిల్లల అనారోగ్యాలకు సంబంధించిన అత్యవసర మందులకు సంబంధించిన కిట్‌ను సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పటికప్పుడు వెళ్లి తెచ్చుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం ఈ కాలంలో పనికి రాదని పేర్కొంటున్నారు. ముందుగానే వైద్యులను కలిసి, తదితర మందులను రెడీగా ఉంచుకోవాలని చెబుతున్నారు. ఈ కాలంలో దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇవీ అనారోగ్య కారకాలే కాబట్టి ఇంటిని ఇన్‌సెక్ట్‌ ఫ్రూప్‌ చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంట్లో, బయట నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు నేలను తరచూ శుభ్రం చేయడం, కిటికీలకు నెట్‌ వేయించడం, దోమ తెర సమకూర్చుకోవడం వంటివన్నీ సాయపడతాయని పేర్కొంటున్నారు. మస్కిటో కాయిల్స్‌, రెపల్లెంట్స్‌ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మేలని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -