– పోషకాహార లోపంతో కృంగి కృశిస్తున్న బాలలు
– 90మంది పిల్లలతో సహా 159మంది మృతి
గాజా : గాజాలో గత 24గంటల్లో ఇజ్రాయిల్ దాడుల్లో 111మంది పాలస్తీనియన్లు మరణించారు. 820మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 91మంది ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జరిగిన దాడుల్లో మరణించిన వారేనని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. గురువారం ఆకలి దప్పులతో ఇద్దరు పిల్లలు మరణించారని వైద్య వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటివరకు కరువు కాటకాలతో మరణించిన వారి సంఖ్య 159కి చేరింది. వీరిలో 90మంది పిల్లలే వున్నారు. గాజాలో కొత్తగా జన్మిస్తున్న పిల్లలందరూ తక్కువ బరువుతో వుంటున్నారని, పోషకాహార లోపం వల్ల వారు సరిగా ఎదగడం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో గాజాలోకి ప్రతిరోజూ వందలాదిగా ఆహార ట్రక్కులు రావాలని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్ధుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధి అద్నన్ అబూ హస్నా పేర్కొన్నారు. కాల్పుల విరమణ జరిగితేనే గాజాలో మానవతా సంక్షోభం పరిష్కారమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. గాజా ప్రజలకు ఆహారం అందాలంటే ఆహార ట్రక్కులు కూడా సురక్షితంగా చేరాలని, అందుకు ఇజ్రాయిల్ సహకరించాలని అన్నారు. గాజాకు అందే ఆహార సాయం ముందుగా ఐక్యరాజ్య సమితి గిడ్డంగులకు చేరితే, అక్కడ నుండి పంపిణీ కేంద్రాల వద్దకు చేరుతుందని అన్నారు. గాజాలో మంచినీటి శుద్ధి కేంద్రాలను నాశనం చేశారు. దీంతో తాగు నీరు కలుషితమై వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
గాజాలో కరువు రక్కసి బారిన చిన్నారులు !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES