Sunday, November 9, 2025
E-PAPER
Homeహెల్త్పిల్లల ఆరోగ్యమే పెద్దల ఆనందం

పిల్లల ఆరోగ్యమే పెద్దల ఆనందం

- Advertisement -

నవంబర్‌ పద్నాలుగు, మన బాలల దినోత్సవ సందర్భంగా, ఈ వ్యాఖ్యని మనమందరమూ వక్కాణించవచ్చు! ”మన పిల్లలపై పెట్టుబడే మన భవిష్యత్తుపై పెట్టుబడి!” ఇంట్లో ఎన్ని సిరిసంపదలున్నా ఇంట్లో చిన్నారులు జ్వరంతో లేదా జలుబుతోనో, దగ్గు- ఆయాసంతోనో, కదలలేకుండా, నీరసంగా, ముడుచుకొని, కళ్లుకూడా తెరవకుండా పడుకొని ఉంటే, ఆ స్థితి అందరినీ కలవరపెడుతుంది.

మానసికంగానో/ అంగ వైకల్యంతోనో పిల్లలున్న ఇంట్లోని పెద్దవాళ్ళ మానసిక వేదనైతే వర్ణాతీతం. ఏ సంబరాన్నీ, ఎటువంటి పండుగనూ కూడా మనసారా జరుపుకోలేరు కదా! ఆరోగ్యపూరిత బాల్యాన్ని/ జీవితాన్ని పిల్లలికి అందివ్వడం ప్రతి తల్లితండ్రుల ప్రాథమిక బాధ్యత. చిన్నారులందరి ప్రాథమిక హక్కు! బాల్యదశలో, తరుచూ జబ్బుల బారిన పడుతూ ఉండే పిల్లల్లో, శారీరక ఎదుగుదల కుంటుపడే అవకాశాలున్నాయి. ఆ కారణంగా వారు మానసికంగా క్రుంగి పోతూ ఉండవచ్చు. బుద్ధి నైపుణ్యం, శరీర సామర్థ్యం, రెండూ అవసరమున్న రంగాలలో ఆరోగ్యవంతులైన తమ సమకాలీకుల కంటే వెనుకబడి పోయే అవకాశముంది. ఇది ఏ తల్లితండ్రులూ కోరుకోరు కదా!

పెద్దవాళ్ళు ఏమి చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు?
పిల్లల ఆరోగ్య సంరక్షణ, వారి జననం కంటే ముందే తల్లి-బిడ్డ సమగ్ర సంరక్షణతో, తల్లి గర్భం నుండే మొదలౌతుంది. ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో తల్లి ఉన్నట్లయితే, దాని ప్రభావం బిడ్డపై తప్పక ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతురాలైన తల్లి ఆరోగ్యవంతమైన బిడ్డకే జన్మనిస్తుంది.

నవజాత శిశువు పోషణ- ఆరోగ్య సంరక్షణ దేనితో మొదలౌతుంది?
బిడ్డ ఆరోగ్య సంరక్షణలో మొదటి మెట్టు-చంటి బిడ్డకు తల్లిపాలు మాత్రమే అందాలి. అవి బిడ్డకు అమతం వంటివి. బిడ్డ ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాల్ని అందజేయడమే కాకుండా, అంటువ్యాధుల నుండి బిడ్డను కాపాడుతుంది. అనివార్య కారణాలుంటే తప్ప, బిడ్డను తల్లిపాలకు ఎట్టిపరిస్థితిలో దూరం చేయకూడదు. తల్లి చనిపోవటం/ పాలివ్వలేని స్థితిలో ఉన్నట్టయితే వెట్‌ నర్స్‌ సహాయం తీసుకోవాలి. తల్లిపాల కొరకు చేసే ప్రయత్నాలు విఫలమై, తప్పనిసరి పరిస్థితుల్లోనే బిడ్డకు పోతపాలు పట్టాలి. పుట్టగానే బిడ్డకు ఇవ్వవలసిన ప్రప్రథమ వ్యాధి నిరోధక టీకాలు క్షయవ్యాధి నుండి రక్షణ కల్పించే బీసీజీ. ఆ తరువాత వాక్సినేషన్‌ విధానాల ప్రకారం సమయానుసారంగా మిగతా టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

సాధారణంగా, ఆరోగ్యవంతురాలైన తల్లి పాలు ఆరు నెలల వరకు బిడ్డ పోషకావసరాలకు సరిపోతాయి. దానికి కొలమానం బిడ్డ బరువు. ఆరునెలల వయసు వచ్చేసరికి పుట్టినప్పటి బరువుకు సుమారుగా రెండింతలౌతుంది. ఆ పైన ఎదుగుదలకి తల్లిపాలు మాత్రమే సరిపోక పోవచ్చు. అంచెలంచెలుగా, ఇనుము, జింక్‌, కాల్షియమ్‌, మాగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్‌ భరితమైన పౌష్టిక, నాణ్యమైన ఘనాహారం, మెత్తగా చేసినది ఇవ్వాలి. కొద్ది మోతాదుల్లో, అంటే, రోజు మొత్తంలో రెండు మూడు టీస్పూన్లతో మొదలుపెట్టి, క్రమంగా పెంచుతూ పోవాలి.
ఈ వయసులో చిన్నారులు రుచి నచ్చితేనే ఆహారాన్ని తీసుకుంటారు. వారికి నచ్చేవిధంగా తయారుచేయాలి. బలవంతంగా తినిపించకూడదు.

తినిపించేవారి చేతులు, వాడుతున్న వస్తువులు చాల శుభ్రంగా ఉండాలి. చెంచా/ గ్లాస్‌తో మంచి నీరుకూడా తాగించాలి. పరిశుభ్రత ఏమాత్రం కొరవడినా, క్రిములవలన అంటువ్యాధులు రావచ్చు. వాంతులు విరేచనాలు అయ్యే ఆస్కారముంటుంది, బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తుంది. వీలైనంతవరకు తల్లిపాలు కొనసాగించాలి. ఆ తరువాత పిల్లలు పెరుగుతున్న కొద్దీ, వారి ఆహార అవసరాలూ పెరుగుతాయి. అందుకు అనుగుణంగా ఆహార మోతాదు పెంచుతూ పోవాలి. పెరుగుతున్న పిల్లలకు ప్రత్యేకించి వేరు ఆహారాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు. కుటుంబంలోని వారందరు తినేవే వారికీ పెట్టాలి. తినమని బలవంతం చేయకుండా వారికి భోజనం పట్ల అవగాహనా-ఆసక్తులు పెంపొందించే విధంగా, వారికి అర్థమయ్యేటట్టుగా ఇంట్లో, స్కూల్లో చర్యలు చేపట్టాలి.

ఈ విషయంలో గ్రూప్‌ ఆక్టివిటీ ప్రక్రియలు చాల దోహదపడతాయి. సమయానుసారంగా పౌష్టికాహారం తీసుకోవడం పెద్దలు పాటిస్తే, ఆ అలవాట్లు పిల్లలికీ అలవడతాయి. ఆరోగ్యపరంగా, పిల్లలు ఏవైనా తినకూడనివి వైద్యులు సూచిస్తే, వాటిని ఇంట్లోని వారందరు రద్దు చేయాలి. ఉదాహరణకి పిల్లలకి ఆస్తమా వంటి జబ్బు ఉన్నప్పుడు, చల్లని వస్తువులు పెద్దవాళ్లు కూడా తీసుకోకుండా వుంటే, పిల్లల్లో వాటి పట్ల ఆసక్తి దానంతటదే పోతుంది. ఫాస్ట్‌ ఫుడ్‌ లాంటివి ఏ మాత్రం ప్రోత్సహించకూడదు. సాధారణంగా పిల్లలు తోటి వారి ఒత్తిడికి లోనౌతుంటారు. ఓపికగా సమతుల్య, పౌష్టిక ఆహారం ప్రాముఖ్యత, దశ్య, శ్రవణ పరికరాల సహాయంతో రైమ్స్‌, పాటలు, కథల రూపంలో వారికి అర్థమయ్యే విధంగా చేప్పే బాధ్యత పెద్దవారిదే. పిల్లల రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి తప్పనిసరి. క్రమేపీ రకరకాల ధాన్యాలు, పప్పుదినుసులు కూరగాయలు, పండ్లు చేర్చుకుంటూ పోవాలి. మాంసాహారులు కోడిగుడ్డు, మాంసం కొద్దికొద్దిగా ఇస్తూ, బిడ్డ జీర్ణశక్తిని గమనించుకుంటూ ఉండాలి.

పౌష్టిక ఆహార విషయంలో, పిల్లల ఇష్టాయిష్టాలను దష్టిలో పెట్టుకోవాలి. పిల్లల ప్రక్కన కూర్చుని వారంతట వారే తినేటట్టుగా ప్రోత్సహించాలి. పిల్లలతో పాటే కుటుంబమంతా భోజనం చేయాలి. ఆలా చేయడం వలన వారి సోషల్‌ స్కిల్స్‌ అభివద్ధి చెందడం జరుగుతుంది. కలిసి భోంచేస్తున్నప్పుడు ఆహ్లాదకరమైన సంభాషణలు జరపాలి. మానసికారోగ్యం బాగుంటుంది. బిడ్డల మానసిక ఆరోగ్యం అత్యంత కీలకమైనది. ఎదుగుతున్న పిల్లల మానసిక స్థితి పది శాతం మాత్రమే జన్యుపరంగా ఉంటుంది. తొంభై శాతం వారు పెరుగుగుతున్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. వారి మానసిక అవసరాలు, శారీరక అవసరాలకు ధీటుగా ఉండి, చాలా క్లిష్టతరంగా పెనవేసుకొని ఉంటాయి.

పిల్లలకు మంచి ఆహారం, వసతులు, విద్యతో బాటు వారి ఆలోచనలు-అలవాట్లు గమనిస్తూ, సమయానుకూల సూచనలు/ ధైర్యాన్నిస్తూ, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే బాధ్యత పెద్దలది. అలాగని, ఎల్లప్పుడూ నీడగా ఉండాలనే తహతహలో, పెద్దలే మహావక్షాలై, తామిచ్చే నీడలోనే పిల్లలు బతకాల్సిన దుస్థితి కలుగజేయొద్దు. నీడ పోతే క్షీణించే బలహీనులుగా తయారు చేయవద్దు. పెద్దవారి ఇష్టాయిష్టాలు పిల్లలపై రుద్దకుండా ఉండడం, కత్రిమ పోటీ/ ఆమోదయోగ్యం కాని టార్గెట్లు/ గాడ్జెట్లు-వీటన్నిటి పట్ల అప్రమత్తమై ఉండటం పిల్లల ఆరోగ్యకరమైన సంరక్షణలో భాగమే! పిల్లల ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించి, తదానుగుణంగా మెలగడం, పెద్దల మహత్తరమైన బాధ్యత. ఉద్యోగాలు, టార్గెట్లు, అంబిషన్ల ఉరుకుల పరుగుల్లో సతమతమయ్యే యువజంటలు, తల్లితండ్రులవ్వక ముందే పిల్లల పెంపకం లోని సూక్ష్మ నైపుణ్యాలు గ్రహించవలసిన అవసరం ఎంతగానో ఉంది!

డాక్టర్‌ మీరా,
రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అఫ్‌ మైక్రోబయాలజీ,
ఫీవర్‌ హాస్పిటల్‌ /ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -