‘బాల సాహిత్యమంటే కేవలం కథలు, గేయాలు మాత్రమేనా?’ అన్న అనుమానం కలగక మానదు. బాలల కోసం రాస్తున్న కొంతమంది కొన్ని అంశాలకు పరిమితమైపోవడం కూడా మనం చూడొచ్చు. స్వభావపూర్ణత కలిగి, బాలల ఆనందం, వికాసం, వినోదం, విజ్ఞానం కలిగించే ప్రతిదీ బాల సాహిత్యమే. అయితే వాటితో పాటు హేతువును, ప్రశ్నించే తత్త్వాన్ని పెంచినట్లయితే మరింత ప్రయోజనం చేకూరుతుంది. బాల సాహిత్య ప్రయోజనం నెరవేరుతుంది. ఆ దిశగా బాలల వికాసం కోసం పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తున్న వారిలో మనకు తిరువూరులో నివాసముంటున్న మందడపు రాంప్రదీప్ మొదటి వరుసలో కనిపిస్తాడు.
‘ఎం. రాంప్రదీప్, తిరువూరు’ పేరుతో రచనలు చేసే ఈయన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని గుంటుపల్లి గోపవరంలో జనవరి 19, 1979 న జన్మించారు. శ్రీమతి మందడపు వరలక్ష్మి, వెంకటేశ్వరరావులు వీరి అమ్మానాన్నలు. పిల్లల కోసం వందలాది విజ్ఞాన, విషయ, జాతీయ నాయకులు, సంస్కర్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వైతాళికులు, ప్రాత:తస్మరణీయుల గురించి దాదాపు మూడువందల అరవైఐదు రోజులు ఏదో ఒక రచన చేస్తారు రాంప్రదీప్. పిల్లలకోసం ఈ వ్యాసాలతో పాటు గ్రంథ రచనకూడా చేశారు. సంఖ్యారీత్యా ఈ వ్యాసాల సంఖ్య మూడువేలవరకు ఉండగా, ఎనమిది పుస్తకాలు అచ్చయ్యాయి. ఇవేకాక హేతువు, వైజ్ఞానికాంశాల సమాహారంగా బాలల కథలు రాశారు. ఈ ఎనిమిది పుస్తకాలు పిల్లల కోసం రాసినవే. వీటిలో ముఖ్యమైన రెండు పుస్తకాలలో మొదటిది ‘భారతదేశం నా మాతృభూమి ప్రతిజ్ఞా రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్ర’. ఇవ్వాళ్ళ దేశమంతా ఆయన రాసిన ప్రతిజ్ఞ చదువుతున్నప్పటికీ చరిత్రలో పైడిమర్రి పేరు ఎక్కడా నమోదు కాలేదు. వీరి కథను తెలుగు, ఆంగ్లభాషల్లో రాసి అందించారు ప్రదీప్. ‘విద్యార్థి’ పేరుతో మల్లి మస్తాన్‌బాబు కథ రాశారు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ గీత రచయిత శంకరంబాడి సుందరాచారి జీవితాన్ని ‘ప్రసన్న కవి’గా అందించారు. వీరి రచనల్లో ‘విస్మృత మహనీయులు’ గురించి మాట్లాడుకోవాలి. తమ రంగాల్లో శిఖరప్రాయులుగా నిలిచినప్పటికీ అంతగా చరిత్రలో నమోదుకాని జాతీయపతాక అమలుతో ముడిపడివున్న సురయ్య త్యాబ్జి, ‘జైహింద్’ రూపకర్త హైదరాబాదీ అబిద్ హసన్ సఫ్రాని, కాటన్‌తో పనిచేసిన ఇంజనీర్ వీరయ్య వంటి ముప్పైమంది విస్కృతుల గురించి ఇందులో రాశారు. చరిత్రలో నమోదైన తొలి ఉపాధ్యాయినుల్లో ‘ఫాతిమా బేగం’ను తెలుగు వారికి పరిచయం చేశారు ఈయన. ‘క్లాస్‌రూం ఇంగ్లీష్’ పుస్తకం కూడా పిల్లల కోసం రాసిన పుస్తకం. ‘ప్రతిజ్ఞ’కు అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అరవై కవితలతో సంకలనం తెచ్చారు రాంప్రదీప్. బాల వికాసకర్తగా ‘మంచిపుస్తకం’ పేరుతో ప్రతినెలా ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్న వీరు జనవిజ్ఞాన వేదికతో పనిచేస్తున్నారు. వీరు తన తాత నాగయ్య జ్ఞాపకంగా పురస్కారాలు అందిస్తున్నారు. ఉపాధ్యాయునిగా ప్రశంసలతో పాటు రెండు ప్రభుత్వాల సత్కారాలను అందుకున్నారు.
బాలల కోసం ప్రతిరోజు ఒక విషయాన్ని, అంశాన్ని వ్యాసంగా పరిచయం చేయడం ఈయన చేస్తున్న పనుల్లో ఒకటి. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ‘కాలేయాన్ని కాపాడుదాం’, కలాం స్ఫూర్తిని ‘కలల సాధనకు స్ఫూర్తి కలాం’, రిజర్వేషన్ల దినోత్సవం సందర్భంగా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి ‘అసమానతల అంతానికి ఆధ్యుడు’ వంటివి వీరి విశేష విషయావగాహన వ్యాసాల్లో ఉన్నాయి. ఇటువంటివి ఒకటి రెండుకాదు ఏకంగా మూడువేలకు పైగా రాసారు. నేటి తరానికి తొలి టెస్ట్‌ట్యూబ్ బేబి లూయిస్ జారు బ్రౌన్ పరిచయంచేస్తూ ‘తొలి టెస్ట్ ట్యూబ్ బేబి జన్మించిన వేళ’ పేరుతో వ్యాసం, కార్గిల్ అమరులను స్మరిస్తూ మన పిల్లలకు వారి వీరత్వం, త్యాగం తెలిసేందుకు ‘కార్గిల్ వీరులని స్మరిద్దాం’ వ్యాసం కూర్చారు. బాల సాహిత్యం విన్నా చదివినా సృజనాత్మక పెరుగుతుందని భావించే రాంప్రదీప్ బాల సాహితీవేత్తలు మంచి రచనలు అందించాలని, ప్రభుత్వాలు తోడ్పడాలని అంటారు. వ్యాసాలు, వైజ్ఞానిక విషయాలేకాక చక్కని కథలను రాశారు వీరు. తన కథల్లో నీతికథలు, జంతువుల్ని పెట్టలేదు. నిత్య జీవితంలోని అనేక అంశాలను వైజ్ఞానిక, సామాజిక కోణంలో రాయడం ఈయనకు బాగా తెలుసు. పిల్లలు పై తరగతికి వెళ్ళగానే పాత పుస్తకాలను అమ్మేస్తుంటారు. అటువంటి పుస్తకాలు ‘మంచి నేస్తాలు’ అని చెబుతారు రచయిత. ఎండమావులను చూసి పిల్లలు ‘నీటి దయ్యం’గా భావించి భయపడతారు. వాళ్ళ భయాన్ని హేతువుతో పోగొట్టడం ఇందులోని విషయం. సందర్భానుసారంగా నీటి పరావర్తనం వంటి వైజ్ఞానిక అంశాలను రాంప్రదీప్ ఉపాధ్యాయ పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మనకు కావాల్సింది ఇదే కదా! గతంలో మన పెండెం జగదీశ్వర్ ‘గజ్జెల దయ్యం’లో ఇదే పని చేశాడు. ఇటువంటిదే మరోకథ ‘మంత్రాలకు చింతకాయలు’ కథ. పేరులోనే విషయం అర్థమవుతుంది. విషంలేని పాము కరిచిన పిల్లవాడిని మంత్రంతో బతికించానన్న వ్యక్తిగుట్టును తెలిపే కథ ఇది. విజ్ఞాన ప్రచారకర్తగా, బాల సాహితీవేత్తగా, బాలల వికాసం కోసం నిరంతరం తపించే కార్యకర్తగా ‘తిరువూరు రాంప్రదీప్’ చేస్తున్న కృషి, తపన ప్రశంసనీయం. ఈ కోవలో మరిన్ని వైజ్ఞానిక కథలను తేవాలని మందడపు రాంప్రదీప్‌ను కోరుతూ… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్
9966229548