బీజింగ్ : ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయిల్ హతమార్చడాన్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఇది ఆమోదయోగ్యమైన చర్య కాదని చైనా పేర్కొంది. అలాగే అమెరికా సైనిక స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ జరిపిన దాడులను కూడా చైనా విమర్శించింది. గురువారం చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ సంబంధాలలో బలప్రయోగాన్ని మేము ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తాము. ఇరాన్ దేశాధినేతలను హత్య చేయడం, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వంటి చర్యలు ఆమోదయోగ్యం కావు. ఇరుపక్షాలు తక్షణమే సైనిక చర్యలను నిలిపివేసి, ప్రాంతీయ పరిస్థితి అదుపు తప్పకుండా నిరోధించాలని చైనా కోరుతోంది’ అని ఆయన అన్నారు.
యుద్ధాన్ని నివారించడానికి మధ్యవర్తిత్వం వహించడానికి బీజింగ్ తనవంతు ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), బహ్రెయిన్, కువైట్, ఈజిప్ట్ దేశాల ఉన్నతాధికారులను చైనా ప్రత్యేక రాయబారి అయిన జై జూన్ కలిశారు. ఈ నెలలో పశ్చిమాసియా ప్రాంతమంతటా ఆయన పర్యటించారు. జారు పర్యటనల సందర్భంగా ఆయన సైనికేతర లక్ష్యాలపై దాడి చేయకూడదని, నౌకా మార్గాల భద్రతకు భంగం కలింగచకూడదని గుర్తించినట్లు లిన్ చెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు జరిగినంతకాలం చైనా చేసే మధ్యవర్తిత్వ దౌత్య ప్రయత్నాలు కూడా ఆగవు అని లిన్ నొక్కి చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాన్, లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లకు బీజింగ్ మానవతా సహాయం అందిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ వారం తెలిపింది.
భారత్‌కు సురక్షితంగా చేరిన 2.8 లక్షల మంది ప్రయాణికులు
ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత 2.8 లక్షల మంది భారతీయ ప్రయాణికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అసీమ్ ఆర్.మహాజన్ తెలిపారు. కువైట్ విమానాశ్రయం మూసివేసినందున సౌదీ అరేబియా మీదుగా ప్రయాణికులను భారత్‌కు చేర్చేందుకు జహీరా ఎయిర్‌వేస్ ప్రత్యేక విమానాలు నడుపుతోందని ఆయన చెప్పారు. మొట్టమొదటి ప్రత్యేక విమానం గురువారం భారత్ చేరుకుంది.



