నవతెలంగాణ-హైదరాబాద్ : వేతన పెంపు కోసం ఈ నెల 4న సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించారు. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో, ఇవాళ్టి నుంచి సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో సినీ కార్మికుల వేతన పెంపునకు అంగీకారం కుదరడంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రికి థాంక్స్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చిరు స్పెషల్ పోస్టు పెట్టారు.
“ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా, ఇటు నిర్మాతలకు, అటు కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకొంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్‌ను దేశానికే కాదు, ప్రపంచ చలన చిత్ర రంగానికే ఓ హబ్ గా మార్చాలన్న ఆయన ఆలోచనలు, అందుకు చేస్తున్న కృషి హర్షించదగినవి.
తెలుగు చిత్రసీమ ఇలానే కలిసి మెలిసి ముందుకు సాగాలని, ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అండదండలు అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నా” అని చిరంజీవి ట్వీట్ చేశారు.