Sunday, July 27, 2025
E-PAPER
Homeహెల్త్చాక్లెట్‌ లంచం

చాక్లెట్‌ లంచం

- Advertisement -

ఒక రోజు ఇందిరా పార్క్‌లో నడుస్తున్న సమయంలో నా చెవులకు ఓ తండ్రి, కొడుకు మధ్య జరిగిన చిన్న సంభాషణ వినబడింది. తండ్రి అడిగాడు.. ”నీ హోం వర్క్‌ చేసావా? లేకపోతే నీకు ఇచ్చిన చాక్లెట్‌ తీసేసుకుంటాను”. చిన్న పిల్లవాడు ”డాడీ, నేను చాక్లెట్‌ తినేశాను” అని బదులిచ్చాడు. తండ్రి ”నీకు ఐస్‌క్రీం కావాలన్నావుగా, నేను కొనను” అన్నాడు. బాబు వెంటనే ”సరే సరే డాడీ! నేను హోం వర్క్‌ చేసేస్తాను!” అని చెప్పాడు.
ఈ మాటలు వినగానే నా నడకలో హుషారు తగ్గింది. ఎందుకంటే ఈ ఒక్క సంఘటన వెనుక మన సమాజం ఎదురు చూస్తున్న పెద్ద సమస్య కనిపించింది. పిల్లలపై చిన్నతనం నుంచే లంచం ఆధారంగా ప్రేరణ కల్పించడం. ఇది మన దేశంలో నేటి అవినీతి మానసిక ధోరణికి మూలంగా మారుతుందా?

ఆపరెంట్‌ కండిషనింగ్‌ (Operant Conditioning):: ఈ ఉదాహరణ క్లాస్‌కల్‌ సైకాలజీలో బిహేవియరిజంలో రిన్ఫోర్స్మెంట్‌ సిద్ధాంతానికి ఉదాహరణ. తల్లి లేదా తండ్రి చిన్నపిల్లల చేత పనులు చేయించుకోవడానికి బదులుగా బహుమతులు ఇస్తుంటే, పిల్లలు అవి పొందేందుకు పనులు చేయడం మొదలుపెడతారు. దీన్ని పాజిటివ్‌ రిన్ఫోర్స్‌మెంట్‌ అంటారు. కానీ దీన్ని తప్పుడు విధంగా వాడితే, పిల్లల మస్తిష్కంలో ”ఏదైనా చేయాలంటే ప్రతిఫలం ఉండాలి” అనే అర్థం ఏర్పడుతుంది.


నైతిక విజ్ఞానం అభివద్ధి (Moral Development):: పిల్లల నైతిక అభివద్ధిలో మొదటి దశ శిక్ష, ప్రతిఫలం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం. కానీ అదే దశలో పిల్లలకు నైతికతను బోధించకపోతే, వారు ఎదుగుతున్న కొద్దీ ప్రతి పనిని ‘లాభం లేదా నష్టం’ అనే దష్టితో చూస్తారు. న్యాయమా కాదా అనే విషయానికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గిపోతుంది.
ఇన్‌స్ట్రుమెంటల్‌ రేషనాలిటీ:
పిల్లలు ‘ఏం చేస్తే నాకు లాభం?’ అనే కోణంలో ఆలోచించడం నేర్చుకుంటే, వారిలో లంచం లేదా దానికి బదులుగా లాభం ఆశించే ధోరణికి పునాది పడుతుంది. ఇది ఎదిగిన తర్వాత సర్వీసు రంగాల్లో, రాజకీయాల్లో, సామాజిక సంబంధాల్లో అవినీతికి దారి తీస్తుంది.
పిల్లల పెంపకం లో…
మోటివేషన్‌ మానవీయంగా ఉండాలి: పిల్లల పనులకు బహుమతి ఇవ్వాలంటే అది ప్రేమ, గుర్తింపు, ప్రశంస రూపంలో ఉండాలి. ప్రతిసారి మెటీరియలిస్టిక్‌ ప్రోత్సాహం (చాక్లెట్‌, ఐస్‌క్రీం, డబ్బు) ఇవ్వకూడదు.
కర్తవ్య భావన పెంచాలి: పని చేయడం ఓ బాధ్యత అని పిల్లల మస్తిష్కంలో నాటాలి. ప్రతిసారి వారు పని చేసినందుకు బహుమతి ఇవ్వడం వల్ల, వారు బహుమతుల కోసమే జీవించాలి అనే అభిప్రాయం ఏర్పడుతుంది.
మానసిక అవగాహన కల్పించాలి: చిన్నతనంలోనే పిల్లలతో నిజాయితీ, కర్తవ్య నిబద్ధత, నైతికత గురించి చిన్నచిన్న ఉదాహరణలతో మాట్లాడటం వల్ల వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు.
మన మాటలు పిల్లల మనస్సులో పదిలమవుతాయి. అవే వాళ్ల భవిష్యత్తు ఆలోచనలకు విత్తనాలు. చిన్నతనంలోనే హోంవర్క్‌ చేస్తే చాక్లెట్‌ ఇస్తాను అనే తాత్కాలిక చర్య, పుట్టుకతో మంచి మనసున్న పిల్లల్లో లాభం కోసం పని చేయాలనే తప్పుడు అభిప్రాయాన్ని పెంచుతుంది.
పైన చెప్పిన ఈ చిన్న సంభాషణ మనకెన్ని ప్రశ్నలు వేస్తుంది గమనించండి… మనం నిజంగా పిల్లలకి విలువలతో కూడిన బోధన అందిస్తున్నామా?
పిల్లల స్వభావాన్ని అవినీతిపరులుగా మలుస్తున్నమా లేక సత్యనిష్ఠ వేత్తలుగా తీర్చిదిద్దుతున్నామా?
నేను విన్న ఈ సంఘటన ఒక్క మాట కాదు, అది ఒక సమాజపు స్థితిగతులను ప్రతిబింబించేది. మానవ మౌలిక విలువల పునర్నిర్మాణం చిన్న వయసు నుంచే ప్రారంభమవ్వాలి.
డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031 కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -