లోతైన అధ్యయనం, పరిశోధనలతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ అకడెమిక్ రంగాల్లో స్థిరీకరించబడ్డ అసంబద్ధ, అసత్య విషయాలను సరిదిద్దాల్సి ఉంటుంది. చరిత్రనూ తిరగ రాయాల్సి ఉంటుంది. ఈ చరిత్రను తిరగరాయడానికి ఇప్పుడు సాహితీ టూల్స్ అందిస్తున్నది, సందర్భాన్ని జోడిస్తున్నది ‘భీమ కవి చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం’ అనే పుస్తకం. ఈ గ్రంథానికి సంపాదకుడు ప్రముఖ కవి, విమర్శకుడు డాకర్ కోయి కోటేశ్వరరావు. రెండు సంవత్సరాలు కష్టపడి చంద్రరావు రచనలు సేకరించి కోయి సంకలనం చేసిండు. ఆర్థికంగా అండగా నిలబడి పుస్తకాన్ని ప్రచురించిన మిత్రులు చంద్రరావు అల్లుడు నేలపూడి బాలరాజు. వీరిద్దరికీ ముందుగా హదయపూర్వక అభినందనలు.
తెలుగునాట అంబేడ్కర్‌ని, అంబేడ్కర్ వాద సాహిత్యాన్ని విస్తతంగా రాసి, ప్రచురించిన కవి చోడగిరి చంద్రరావు. అంబేడ్కర్ చనిపోయిన (1956) నాటి నుంచి ఆయన బాటలో నడుస్తూ, ఆ భావాలను పద్యాలు, పాటలు, కవిత్వం, గీతాల్లో రికార్డు చేస్తూ వచ్చిన నిత్య చైతన్యశీలి చంద్రరావు. నిజానికి తన 12వ యేట 1944 సెప్టెంబర్‌లో అంబేడ్కర్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నాడు స్వయంగా దగ్గరి నుంచి చూసి స్ఫూర్తిపొందినవాడు చంద్రరావు. ఆయన స్ఫూర్తితోనే అంబేడ్కర్ మూర్తిమత్వాన్ని, భావజాలాన్ని, పీడిత వర్గాల కర్తవ్యాన్ని తన రచనల్లో కైగట్టిండు. కుల, మతోన్మాదాలకు చెక్ పెట్టాలనీ, అందుకు ముందుగా మనువాదాన్ని ఖతం చేయాలని పిలుపునిచ్చాడు. దళితుల జీవితాలను ప్రభావితం చేసే వివిధాంశాలను అంబేడ్కర్ భావజాల దక్కోణంలో కైగట్టిండు.
చోడగిరి చంద్రరావు సాహిత్యాన్ని నాలుగు కవితాపాయలుగా విభజించవచ్చు. వచన కవిత్వం, గీతాలు/ గేయాలు, పద్య (ఆటవెలదులు)/ శతక రచనలుగా పేర్కొనాలి. ఈ కవితా పాయలలో కవి తన ప్రపంచ పరిజ్ఞానం, ఇండో-పాక్ యుద్ధ సంక్షోభం, తెలుగునాట దళిత చైతన్యం, దళితులపై హింస-దౌర్జన్యం, పేదరికం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ధిక్కారం, అంబేడ్కర్ స్ఫూర్తి, కుల వివక్షకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమం, మనువాదం, కాషాయీకరణ, భక్తి, రాజకీయ స్పహ, భావజాల అవగాహన, గోదావరి నదీతీర ప్రాంతం, ప్రకతి, విశిష్ట వ్యక్తులు, నోస్టాల్జియా, తెలుగు భాష, సంస్కతి, ఉగాదులు, విద్య ప్రాధాన్యత ఇట్లా భిన్న అంశాలపై సజన చేసిండు. భావజాల, సిద్ధాంత అంశాలపై తన అవగాహనను, అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండు. అందరూ ‘హరిజన’ పదాన్ని ఆమోదిస్తున్న కాలంలో దాన్ని వ్యతిరేకించిండు. కొంతమంది వందిమాగధులను అందలమెక్కించే ఆధిపత్యకుల సాహిత్యకారులపై అక్షరాయుధాలను సంధించాడు. ‘విరసం’ను సైతం వదలలేదు.
చోడగిరి అంబేడ్కరిజంను ఆచరించి, ప్రచారం చేసిండు. అంబేడ్కర్‌ని అందరివాడిగా నిలబెట్టిండు. ఓటు హక్కు కల్పనలో అందరికీ ఎట్లా సమాన భాగస్వామ్యం దక్కిందో ప్రజాస్వామిక సౌధానికి పునాదులయిన జ్యుడిషియరీ, ఎగ్జిగ్యూటివ్, లెజిస్లేచర్, మీడియాల్లో సైతం ఎవరి జనాభా దామాషా మేరకు వారికి న్యాయంగా వాటా దక్కాలనే భావనతో చంద్రరావు కవిత్వమల్లిండు. అంబేడ్కర్‌క వేసిన, నడిచిన అక్షరాల దారులే సరైన మార్గమని తేల్చి చెప్పిండు.
1956 డిసెంబర్ ఆరున అంబేడ్కర్ చనిపోవడంతో ఆయన స్మతిలో ‘దివ్య సంస్మతి’ పేరిట నివాళి అర్పించాడు. అందులో
”బాబా లేవా- లేనే లేవా/ మము వీడినావా- మరి కనరావ/ నీ జీవితములను ఆదర్శముగ/ నిడికొని బ్రతికెదమయ్య/ నీ ఆశయములు- నెఱవేరగను/ నిరతము పోరెదమయ్య” అంటూ అంబేడ్కర్ ఆశయ సాధనకు నిరంతరం పోరు చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా మొదటి సారిగా 1972 ఆ ప్రాంతంలో ‘భీమ శతకము’ని వెలువరించారు. కచ్చితంగా చెప్పాలంటే 1972-1974 మధ్యకాలంలో ఈ శతకాన్ని రాసిండు. ఎందుకంటే ఇందులో ”ఈలి వాడపల్లి ఇపుడు లేడాయనే/ జాతి నుద్ధరింప జన్మమెత్తె/ స్వార్థచింత లేని సన్మార్గుడాతండు” అని 1972 నవంబర్‌లో చనిపోయిన ‘ఆంధ్రా అంబేడ్కర్’ వాడపల్లిని స్మరించుకున్నాడు.
ఆటవెలదుల్లో అంబేడ్కర్‌ని తెలుగు సాహిత్యంలో బలంగా నిలబెట్టడమే గాకుండా, ఆయన భావజాలాన్ని అలతి అలతి పదాలతో ‘ఏమి సెప్పనయ్య! భీమరాయ!’ అనే మకుటంతో 144 పద్యాల్లో మొదటి భాగంలో (1972) రెండో భాగంలో (1989) 108 పద్యాల్లో భావావేశం, భాషాభినివేశాన్ని రంగరించి అక్షరాల్లో పోతపోసిండు.
”గుండుబల్ల సభల లండను నగరాన/ పార్లమెంటులోన పదవిలోన/ కన్నులందు మమ్ము కొన్నవాడెవ్వండు” అంటూ అంబేడ్కర్ ఘనతను చాటిండు.
కంచికచర్ల కోటేషు ఉదంతాన్ని ఆగ్రహంతో కైగట్టిండు. తిరగబడు అని పిలుపునిచ్చాడు. అందులో ”కంచె చేను మేసె కంచికచెర్లలో/ పెదవి కదుపలేదు పెద్దవారు/ కాల్చి చంపరేని కసితీరదా యేమి” అని బాధాగ్నిని అక్షరబద్ధం చేసిండు.
నక్సల్కెట్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కూడా చంద్రరావు కవిత్వమల్లిండు. దామగుండం ఖాండవ దహన సందర్భంలో మనం ఇప్పుడు మాట్లాడుతున్న పర్యావరణ పరిరక్షణ గురించి, వక్షాలను రక్షించాలని 45 ఏండ్ల కిందటే చంద్రరావు రాసిండు. ‘వక్ష సంపద’ శీర్షికన రాసిన 16 పద్యాల్లో మచ్చుకు ఒకటి ఇలా ఉంది. ”మనసులోన పెంఉ మంచియాలోచనల్/ ఇంటికొక్క చెట్టు ఇపుడె పెంచు/ అడవి నఱకివైచి అగచాట్లు పడవద్దు/ తెలుగులార భువికి వెలుగులార” అంటూ హితవు చెప్పిండు.
రాజ్యాంగవాదులు అని విమర్శల పాలవుతున్న దళిత, బహుజనులు, అస్తిత్వ ఉద్యమకారులు అంబేడ్కర్‌వాద సాహిత్యాన్ని సమున్నతంగా నిలబెట్టేందుకు నడుం కట్టాల్సిన సందర్భమిది. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మూన్నెళ్లకొక అంబేడ్కర్‌పై పరిశోధనాత్మక రచనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 22 సంపుటాల అంబేడ్కర్ రచనలు గ్రంథ రూపంలో వచ్చాయి. తెలుగులో సైతం భిన్న కోణాల్లో అంబేడ్కర్‌ని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. 1968లో యెండ్లూరి చిన్నయ్య రాసిన జీవిత చరిత్ర మొదలు ఇప్పటి వరకు అంబేడ్కర్‌పై వందల గ్రంథాలు వెలువడ్డాయి. నిజానికి అంబేడ్కర్ రచనలకు సాహిత్య దర్జా దక్కలేదు. ఆయన భాష, శైలి మీద చర్చ జరగాల్సి ఉన్నది. అంబేడ్కర్ వాద సాహిత్యంపై అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు తెలుగులో అంబేడ్కర్ మీద వెలువడ్డ సజనాత్మక సాహిత్యాన్నంతా ఒక్కదగ్గరికి తీసుకు రావాలి. అంబేడ్కర్‌వాద భావజాల వ్యాప్తికి ఇది రహదారి మార్గం. ఈ మార్గంలో నడిచే వారికి ‘లైట్ హౌజ్’లాంటి రచన చోడగిరి చంద్రరావు సమగ్ర రచనల సంపుటి.
– డా.సంగిశెట్టి శ్రీనివాస్