– అక్రమ అరెస్టులు హిందూత్వ ఎజెండాలో భాగమే
– ఛత్తీస్‌గఢ్ జైల్లో నన్స్‌తో బృందా కరత్ ములాఖాత్
దుర్గ్ : ఛత్తీస్‌గఢ్‌లో మానవ అక్రమ రవాణా, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై ఇద్దరు కాథలిక్ నన్స్‌లను అరెస్టు చేయడం ‘రాజ్యాంగ విరుద్ధమే కాదు.. చట్టవిరుద్ధం’ అని సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు బృందా కరత్ అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ సెంట్రల్ జైలులో కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ను కలవటానికి బృందాకరత్‌కు అనుమతి నిరాకరించిన ఆ రాష్ట్ర సర్కారు దిగివచ్చింది. బుధవారం వారిని కలిసేందుకు అనుమతించింది. ”ఇది దేశంలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న దాడి” అని ఆమె, వామపక్ష పార్టీల ప్రతినిధి బృందం, ఒక కాంగ్రెస్ నాయకుడితో కలిసి జైలు వెలుపల విలేకరులతో మాట్లాడారు. 25న ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో నన్స్ ప్రీతి మెర్రీ, వందన ఫ్రాన్సిస్‌లతో పాటు సుకమాన్ మాండవిని ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) అరెస్టు చేశారు. స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదు మేరకు నన్స్‌ను అదుపులోకి తీసుకున్నట్టు వారు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాబల్యం ఉన్న నారాయణపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలను బలవంతంగా మతమార్పిడి చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ”మేం విన్న, చూసిన దాంతో తీవ్రంగా కలత చెందాం. కల్పిత కేసు ఆధారంగా, ఇద్దరు నన్స్‌ను అరెస్టు చేశారు” అని కరత్ అన్నారు. ఏండ్ల తరబడి పేదలకు సేవ చేస్తున్న ఇద్దరు నన్స్‌ను కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ సర్కార్ జైలుకు పంపిందని వెల్లడించారు. ”ప్రస్తుతం వారు జ్వరం, ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ వారిని నేలపైనే పడుకోబెట్టారు. దేశంలో ఏం జరుగుతోంది. ఈ చర్య చట్టవిరుద్ధమే కాదు, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఇది దేశంలోని క్రైస్తవులే లక్ష్యంగా చేస్తున్న దాడి. ప్రాథమిక మానవ విలువలను సైతం తుంగలో తొక్కుతున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పాలనకు బదులుగా గూండాల పాలన కొనసాగుతోందని బృందా దుయ్యబట్టారు. అమాయకుడైన ఓ గిరిజన వ్యక్తిని సైతం అరెస్టు చేశారని తెలిపారు. గిరిజనుల శ్రేయోభిలాషులమని చెప్పుకునే బీజేపీ సర్కార్ గిరిజనుడిపై దాడికి పాల్పడటం సిగ్గుచేటు అని ఆమె అన్నారు.
వారిపై మోపిన మానవ అక్రమ రవాణా, మతమార్పిడి ఆరోపణలను కరత్ తిరస్కరించారు. ”భారతీయ పౌరులకు దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి, ఉపాధి పొందేందుకు హక్కు ఉంది. దేశంలోని మైనారిటీలపై దాడి చేయడం హిందూత్వ ఎజెండా అయినందువల్లే వారిపై అక్రమ రవాణా ఆరోపణను మోపారు. వారిపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి” అని ఆమె వెల్లడించారు.
సీఎంను కలిసిన ప్రతినిధి బృందం
ప్రతినిధి బృందం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కూడా కలిసింది. ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల భద్రత అంశాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరమని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. మతమార్పిడికి యత్నించారని సీఎం అభిప్రాయం వ్యక్తం చేయగా, ఆ వాదనను బృందం తోసిపుచ్చింది. సీఎంను కలిసిన వారిలో సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్, సీపీఐ(ఎం) ఎంపీలు కె. రాధాకృష్ణన్, ఎ.ఎ. రహీం, సీపీఐ నాయకురాలు అన్నీ రాజా, సీపీఐ ఎంపీ పి.పి. సునీర్, కేసీ (ఎం) ఎంపీ జోస్ కె. మణి.తదితరులు ఉన్నారు.
క్రైస్తవులే బీజేపీ టార్గెట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES