హన్షితా రెడ్డి… పెద్ద నిర్మాత దిల్ రాజు కూతురుగానే కాకుండా బలగం సినిమా నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రివలె విభిన్నమైన చిత్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు కొత్తగా వ్యాపారంలోకి కూడా ప్రవేశించారు. ‘ది గుడ్ సైడ్’ పేరుతో వినూత్నమైన మేకప్ స్టూడియో ఒకటి ఇటీవలె ప్రారంభించారు. ఇద్దరు పిల్లలకు తల్లిగా బాధ్యతలు చూస్తూనే ఇటు సినిమా, ఇటు వ్యాపార రంగాల్లో రాణించేందుకు ప్రణాళికలు రూపొందించిన ఆమె పరిచయం నేటి మానవిలో…
‘ది గుడ్ సైడ్’ ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది?
నా కో ఫౌండర్ హారిక ఆలోచన ఇది. తన భర్త నా కాలేజ్ ఫ్రెండ్. తను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్. నేటి లైప్ స్టైల్ వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు. అలాంటి వారు రిలాక్స్ కోసం ఇలాంటి మేకప్ స్టూడియోలు, సెలూన్లకు వస్తుంటారు. ఇటీవల అందంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ద కూడా పెరుగుతుంది. కనుక వీరికి ఒక మంచి వాతావరణం కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా మన శరీరాన్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడే ఉత్సాహంగా పని చేయగలుగుతాం. అది కల్పించడం కోసమే దీన్ని ప్రారంభించాము.
ఇప్పటికే సిటీలో ఇలాంటి సెలూన్లు చాలా ఉన్నాయి. మరి మీరు ప్రారంభించిన దాంట్లో ఏమైనా ప్రత్యేకత ఉందా?
మేకప్ అంటే ఏదో ముఖానికి రంగులు వేసుకొని కనిపించడం కాదు. ప్రతి ఒక్కరిలో ఒక గుడ్ సైడ్ ఉంటుంది. దాన్ని గుర్తించి మేకప్ ద్వారా వారి వ్యక్తిత్వంలోని సహజ లక్షణాలను మరింత అందంగా ఎలిమేట్ చేయడం మా లక్ష్యం. ముఖ్యంగా ఒక ప్రశాంత వాతావరణం కల్పించాలని పెద్ద ప్లేస్‌లో దీన్ని ఏర్పాటు చేశాము. ఏదో హడావుడిగా వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా కొద్ది సేపు ప్రకృతిలో కూర్చుని వెళ్లిన ఫీలింగ్ రావాలని చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు, మొక్కలు, సన్నటి నీటి ధారలు ఏర్పాటు చేశాము. ప్రశాంతమైన సంగీతం వింటూ వాళ్లకు కావల్సిన సేవలు చేయించుకోవచ్చు.
బలగం సినిమాకు ప్రొడ్యూసర్‌గా చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణమే ఉండేది. చిన్నతనం నుండి సినిమాలు చూస్తూ పెరిగాను. ఇక నాన్న సినిమా రిలీజ్ అవుతుందంటే ఫస్ట్ డే మార్నింగ్ షోకే వెళ్లిపోయే వాళ్లం. అలా నేను కూడా బలగం మూవీకి ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన వచ్చింది. మూవీ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన కథ. అందుకే రిస్క్ అయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మొత్తం తెలంగాణ భాష, కల్చర్ ఇందులో కనిపిస్తుంది. అందుకే నాకు నచ్చింది. అయితే ఏదో మామూలుగా ఆడితే చాలు అనుకున్నాము. కానీ ఇంత సక్సెస్ అయ్యి ఇన్ని అవార్డులు వస్తాయని అస్సలు ఊహించలేదు. ఈ మధ్య కూడా గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాం. తర్వాత ఆ జనక ఐతే గనక తీశాను. ఈ కథ కూడా కొత్తగా అనిపించింది. సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం.
సినిమాలకు సంబంధించిన ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా?
అలాంటిదేమీ లేదు. విల్లామేరి కాలేజీలో చదువుకున్నాను. తర్వాత బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చేశాను. అయితే పెరిగిన వాతావరణాన్ని బట్టి సినిమా అంటే పిచ్చి. బలగం చేస్తానప్పుడు నాన్న కూడా చాలా ప్రోత్సహించారు. ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చినందుకు చాలా సంతోషించారు. అలాగే నా భర్త అర్చిత్ రెడ్డి కూడా చాలా ప్రోత్సహించారు.
బిజినెస్ ప్రారంభించారు మరి సినిమాల సంగతేంటీ?
చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేశావు కదా మూవీస్‌కు దూరమైపోతావా అంటున్నారు. కానీ నేను రెండూ చెయ్యాలనుకుంటున్నాను. సినిమా నా ప్యాషన్ అయితే బిజినెస్ హబీలాంటిది. వేటినీ వదులుకోను. దీంతో పాటు బిజినెస్ కూడా చేయగలను అనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా భర్త ఇస్తున్న ప్రోత్సాహం అలాంటిది. మహిళలు ఎంపవర్‌గా ఉండాలి, ఏదైనా సాధించాలి అని చెబుతుంటారు.
ఇంకా నాన్న నుండి ఏం నేర్చుకున్నారు?
నాన్న చాలా హార్డ్‌వర్కర్. అలాగే చాలా స్ట్రిక్ట్. ఆయనే నా ఇన్సిపిరేషన్. ఆయనకు సినిమా అంటే పిచ్చి. ఎప్పుడు చూసినా ఇంట్లో సినిమాకు సంబంధించిన చర్చే. నాన్న తీసిన సినిమాల్లో బొమ్మరిల్లు అంటే చాలా ఇష్టం. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది. ఇక క్లాసికల్‌లో అయితే ‘శతమానం భవతి’ అద్భుతం.
సాధారణంగా పెండ్లి తర్వాత అమ్మాయిల కెరీర్‌కు బ్రేక్ పడుతుంటుంది. కానీ మీరు పెండ్లి తర్వాతనే మీ కెరీర్ మొదలుపెట్టినట్టున్నారు?
అవును మీరు చెప్పింది నిజమే. పెండ్లికి ముందు నా గురించి బయటి ప్రపంచానికి తెలియదు. బయట ఎక్కువగా కనిపించేవాళ్లం కాదు. చెప్పాను కదా నాన్న చాలా స్ట్రిక్ట్ అని. ఒక సెలబ్రెటీ కూతురుని కాబట్టి నాన్న జాగ్రత్తగా పెంచారు. కానీ పెండ్లి తర్వాత నా భర్త, అత్తయ్య, మామయ్య అందరూ మహిళలు ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచనలు ఉన్నవాళ్లు. నా భర్త రియల్‌ఎస్టెట్ చేస్తారు. నన్ను చాలా ప్రోత్సహిస్తారు. ఇంట్లో ఉమెన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ ఇల్లు స్ట్రాంగ్‌గా ఉంటుంది అని నమ్మే వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం వల్లనే సినిమాలు తీస్తూనే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు. నాన్న, భర్త ఇద్దరూ నాకు రెండు పిల్లర్స్. అంతే కాదు నా బంధువులు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు.
నేటి యువతులకు మీరేం చెప్తారు?
మనపై మనకు ఓ క్లారిటీ ఉండాలి. మనం ఏం చేయాలి, ఏం సాధించాలి అనే విషయంలో ఓ స్పష్టత ఉండాలి. అలా మనం ప్రయాణిస్తే వెళ్లే దారిలోనే ఎన్నో నేర్చుకుంటాము. అపజయాలు ఉండొచ్చు వాటి నుండి నేర్చుకొని ముందుకు వెళ్లాలి. భయపడి ఆగిపోవద్దు.
మరి పిల్లలు, బిజినెస్, మూవీస్ ఎలా సాధ్యమంటారా?
ప్లాన్ చేసుకుంటే సాధ్యమే. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్లను చూసుకుంటూనే నా కెరీర్‌లో కూడా ముందుకు వెళతాను. ఏదైనా మనం ప్లాన్ చేసుకునేదాన్ని బట్టే ఉంటుంది. మనకు ఇష్టమైతే ఎంత కష్టమైనా ఇబ్బంది అనిపించదు. నా వర్క్‌ను నేను ముందే ప్లాన్ చేసుకుంటాను. మనం ఒకటి చేయాలనుకుంటే ఎంత కష్టమైనా ముందుకే వెళ్లాలి. ఇది నేను చిన్నతనం నుండి నాన్న నుండి నేర్చుకున్నాను.
- సలీమ



